12 March, 2026 | 8:21 AM

ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా

12-03-2026 01:04 AM

భామరుద్దు లైలా చెరువులో ఆక్రమణల తొలగింపు

రూ.7 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్న అధికారులు

ప్రహరీకి కంచెను వేసిన హైడ్రా

రాజేంద్రనగర్ మార్చి 11 (విజయక్రాంతి): రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని మిషన్ పోలీస్ అకాడమీ ముందు ఉన్న భామరుద్దు లైలా చెరువు భూమిలో హైడ్రా అధికారులు మంగళవారం మెరుపు దాడు లు చేశారు.. చెరువు భూమిని అక్రమంగా కబ్జా చేసి షెడ్డు నిర్మించడంపై బుధవారం హైడ్రా అధికారులు ఆక్రమణలో భాగంగా వేసిన రేకుల షెడ్డును తొలగించారు.

సుమారు రూ.6 నుండి రూ.7 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా భూమిని తిరిగి స్వాధీన చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ చెరువు భూమిని నిరుపేదలకు 60 గజాల స్థలం పంపిణీ చేయాలని సిపిఎం పార్టీ ధర్నాలు కూడా నిర్వహించింది. అయితే ఆ తర్వాత కొంతమంది రియాల్టర్లు, రౌడీషీటర్లు చెరువు భూమిపై కన్నేసి అక్రమంగా కబ్జా చేసి బహుళ అంతస్తుల నిర్మాణాలు చేపట్టారు. ఈ వ్యవహారంలో పలువురు అధికారులు మారినా సమస్యకు పరిష్కారం దొరకలేదు.

కబ్జాదారులు చెరువు ప్రాంతా న్ని పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకుని ఇతరులు లోపలికి రాకుండా ప్రహరీ గోడలు కూడా నిర్మించారు. ఇటీవల ప్రభుత్వ భూముల కబ్జాలను తొలగించేందుకు ఏర్పాటు చేసిన హైడ్రా విభాగానికి ఈ చెరువు ఆక్రమణలపై ఫిర్యాదు అందడంతో అధికారులు పోలీసుల సహకారంతో కబ్జాలను తొలగించారు. చెరువు చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చివేసి స్థలాన్ని తిరిగి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నారు. అనంతరం ఆ ప్రదేశం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడినందుకు స్థానిక ప్రజలు హైడ్రా అధికారులను ప్రత్యేకంగా అభినందించారు