6 March, 2026 | 7:12 AM

చర్లపల్లి భూవివాదంపై హైడ్రా విచారణ

06-03-2026 01:26 AM

కీలక ఆధారాల సమర్పణకు ఆదేశాలు

కుషాయిగూడ, మార్చి 6 (విజయక్రాంతి) : కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లి రైల్వే స్టేషన్కు సమీపంలో ఉన్న సర్వే నంబర్ 186/4కు సంబంధించిన స్థలం విషయంలో వివాదం తీవ్రతరమవుతోంది. ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా అధికార బృందం శుక్రవారం ఈసీ నగర్ ప్రాంతాన్ని సందర్శించి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఇరుపక్షాల వాదనలు విన్న హైడ్రా అధికారులు, భూమికి సంబంధించిన అన్ని ఆధారాలు, పత్రాలను సమర్పించాలని ఆదేశించారు.

స్థల యాజమాన్యం విషయంలో ఇరు వర్గాల మధ్య భిన్నాభిప్రాయాలు ఉండటంతో వివాదం మరింత ముదిరింది. ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు మాట్లాడుతూ, ఈ స్థలాన్ని గతంలో గిఫ్ట్ డీడ్ ద్వారా జిహెచ్‌ఎంసికి అప్పగించామని తెలిపారు. అందువల్ల ఈ భూమి ప్రభుత్వానికి చెందినదేనని వారు స్పష్టం చేశారు. మరోవైపు వ్యక్తిగత యజమానులు మాట్లాడుతూ, ఈ భూమి తమ స్వంతమని పేర్కొన్నారు.

గౌర వ హైకోర్టు ఆదేశాల మేరకు అధికారిక సర్వే నిర్వహించి, హద్దులు నిర్ణయించి తమకు అప్పగించారని తెలిపారు. దీనికి సంబంధించిన పత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడిం చారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల ధరలు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ స్థలం విలువైనదిగా మారడం తో వివాదం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కారణంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. పరిస్థితిని సమీక్షించిన హైడ్రా అధికారులు, సమర్పించబోయే పత్రాలను పరిశీలించిన అనంతరం తగిన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఈ నేపథ్యంలో, స్థల వివాదంపై స్పష్టత తీసుకురావాల్సిన బాధ్యత జిహెచ్‌ఎంసి అధికారులపై ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను వెలికి తీసి, ప్రజల్లో ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని వారు కోరుతున్నారు. అధికారిక నిర్ణయం వెలువడే వరకు కట్టడాలు నిర్వహించవద్దని ఆదేశాలు జారీ చేశారు.

ఈ విచారణ కార్యక్రమంలో ఈసీ నగర్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బూడిద శ్రవణ్ కుమార్ గౌడ్, ఉపాధ్యక్షురాలు సిహెచ్ పద్మిని, కోశాధికారి కాసుల ఇందిరాగౌడ్, సీనియర్ సిటిజన్ అధ్యక్షులు సత్తిరెడ్డి, ఈసీ నగర్ వెల్ఫేర్ అధ్యక్షులు ప్రసాద్, గోవర్ధన్, బాలయ్య గౌడ్, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.