2 September, 2026 | 1:19 AM

అంతర్జాతీయ ర్యాలీలో హైదరాబాద్‌వాసి సత్తా

02-09-2026 | 12:11am
  1. నవీన్ పులిగిల్ల అద్భుత ప్రదర్శన
  2. పరాగ్వేలో డబ్ల్యూఆర్సీ3 పోడియంపై నవీన్‌మూసా హ్యాట్రిక్

హైదరాబాద్, సెప్టెంబర్ 1 (విజయక్రాంతి): భారత ర్యాలీ డ్రైవర్ నవీన్ పులిగిల్ల(Naveen Puligilla), కో-డ్రైవర్ మూసా షెరిఫ్ అద్భుత పునరాగమనంతో ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డీఎల్ ఆటోమొబైల్(Federation International DL Automobile) (ఎఫ్‌ఐఏ) వరల్డ్ ర్యాలీ ఛాంపియన్‌షిప్(World Rally Championshi) (డబ్ల్యూఆర్‌సీలో ) లో మరో పోడియం సాధించారు. ఆదివారం ముగిసిన 11వ రౌండ్ ర్యాలీ డెల్ పరాగ్వేలో డబ్ల్యూఆర్సీ3 విభాగంలో మూడో స్థానంలో నిలిచారు.

ఈ విజయంతో డ్యూరాన్ రేసింగ్కు చెందిన నవీన్‌మూసా జోడీ వరుసగా మూడో డబ్ల్యూఆర్సీ3 పోడియం సాధించింది. 2025 నవంబర్లో సీజన్ ముగింపు ర్యాలీ సౌదీ అరేబియాలో రెండో స్థానంలో నిలిచిన నవీన్, డబ్ల్యూఆర్సీ విభాగంలో పోడియం సాధించిన తొలి భారతీయ డ్రైవర్గా చరిత్ర సృష్టించారు. అదే సమయంలో నవీన్‌మూసా జోడీ డబ్ల్యూఆర్సీలో పోడియం సాధించిన తొలి ఆల్-ఇండియన్ డ్రైవర్‌కో-డ్రైవర్ జోడీగా నిలిచింది.

అనంతరం మార్చిలో జరిగిన సఫారీ ర్యాలీ కెన్యాలో మూడో స్థానాన్ని సాధించారు.ఈ సీజన్‌లో రెండో డబ్ల్యూఆర్సీ ర్యాలీలో పాల్గొన్న హైదరాబాద్కు చెందిన నవీన్, కాసర్గోడ్‌కు చెందిన అనుభవజ్ఞుడైన కో-డ్రైవర్ మూసా షెరిఫ్ ఫోర్డ్ ఫియస్టా ర్యాలీ3తో 22 కఠినమైన రెడ్-గ్రావెల్ స్పెషల్ స్టేజ్లలో మొత్తం 357.64 కిలోమీటర్ల దూరాన్ని 5 గంటల 10 నిమిషాల 54.9 సెకన్లలో పూర్తి చేశారు. పెనాల్టీలతో కలిపిన ఈ సమయంతో పాటు, అన్ని విభాగాల్లో పాల్గొన్న 58 కార్లలో కేవలం 44 కార్లు మాత్రమే ర్యాలీని పూర్తి చేశాయి.

కాగా ‘ఈ ఫలితంతో మేము ఎంతో ఆనందంగా ఉన్నాం. ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా చివరి వరకు దృష్టిని కోల్పోకుండా పోరాడాం. భారత జెండాతో పోడియంపై నిలబడటం ఎంతో గర్వంగా ఉంది’, అని ఆష్యా గ్రూప్, యులా గ్లోబస్ మద్దతు ఇస్తున్న నవీన్ పులిగిల్ల అన్నారు. 35 ఏళ్ల అనుభవంతో 350కు పైగా ర్యాలీల్లో పాల్గొని, ఎనిమిది సార్లు భారత జాతీయ ర్యాలీ కో-డ్రైవర్ ఛాంపియన్గా నిలిచిన మూసా షెరిఫ్ మాట్లాడుతూ, సౌదీ అరేబియా ఎడారుల నుంచి కెన్యాలోని కఠినమైన భూభాగం, ఇప్పుడు పరాగ్వేలోని సాఫ్ట్ గ్రావెల్ వరకు ప్రతి ర్యాలీ మమ్మల్ని విభిన్నంగా పరీక్షించింది.

ఈ స్థాయిలో వరుసగా మూడు పోడియంలు సాధించడం ఎంతో ప్రత్యేకమైన విషయం, అన్నారు. శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్స్, సంవీర్ గ్రూప్ మద్దతు కూడా అందిస్తున్న నవీన్‌మూసా జోడీ తదుపరి ఈ నెల 10 నుంచి 13 వరకు జరగనున్న డబ్ల్యూఆర్సీ 12వ రౌండ్ ర్యాలీ చిలీపై దృష్టి సారించనుంది.