ప్రపంచ స్థాయి గమ్యస్థానంగా హైదరాబాద్
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
కండూ ఏఐ ఇండియా చిప్ డిజైన్ హెడ్ క్వార్టర్స్‌ను
ప్రారంభించిన మాజీ మంత్రి
హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): హైదరాబాద్ ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్టెక్, ఏఐ రంగాలకు విశ్వసనీయ గమ్యస్థానంగా ఎదగడం తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన దూరదృష్టి విధానాల ఫలితమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ప్రముఖ సెమీకండక్టర్ సంస్థ కండూ ఏఐ ఏర్పాటు చేసిన ఇండియా చిప్ డిజైన్ హెడ్ క్వార్టర్స్‌ను ప్రారంభించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడుతూ ప్రతిభ, పరిశ్రమలకు అనుకూల వాతావరణం, అత్యుత్తమ మౌలిక సదుపాయాల కారణంగానే ప్రపంచ దిగ్గజ సంస్థలు హైదరాబా ద్‌ను తమ విస్తరణకు ఎంచుకుంటున్నాయన్నారు. కండూ ఏఐ తన ఇండియా చిప్ డిజైన్ హెడ్ క్వార్టర్స్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం నగర ప్రతిష్ఠను మరింత పెంచుతుందన్నారు.
ఈ సంస్థ ద్వారా అత్యాధునిక సాంకేతిక ఆవిష్కరణలు, ఉన్నత స్థాయి ఉపాధి అవకాశాలు, సెమీకండక్టర్ పరిశ్రమలో మరిన్ని పెట్టుబడులు తెలంగాణకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆశాభా వం వ్యక్తం చేశారు. కండూ ఏఐ సీఈఓ, కో-ఫౌండర్ సృజన్ లింగ మాట్లాడుతూ భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు, పరిశ్రమలు, ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కేంద్రంలో చిప్ డిజైన్, వెరిఫికేషన్, వాలిడేషన్, ఫర్మ్‌వేర్, సాఫ్ట్‌వేర్, సిస్టమ్స్ ఇంజనీరింగ్, కస్టమర్ సపోర్ట్ వంటి కీలక విభాగాలు పనిచేయనున్నాయి. దీంతో కండూ ఏఐ గ్లోబల్ ఇంజనీరింగ్ నెట్‌వర్క్ మరింత బలోపేతం కావడంతో పాటు, హైదరాబాద్ అంతర్జాతీయ సెమీకండక్టర్ హబ్‌గా తన స్థానాన్ని మరింత బలపరుచుకోనుంది.






