calender_icon.png 15 February, 2026 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొత్త మున్సిపాలిటీల్లో హంగ్ ప్రభావం..

14-02-2026 12:00:00 AM

  1. ఇంద్రేశం, ఇస్నాపూర్, జిన్నారంలో ఉత్కంఠ

గుమ్మడిదల, గడ్డపోతారం బీఆర్‌ఎస్ కైవసం

పటాన్చెరు/గుమ్మడిదల, ఫిబ్రవరి 13 : పటాన్చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడిన ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. కొత్త మున్సిపాలిటీలలో ఏ పార్టీ ఆధిక్యత సాధిస్తుందోనని ఎదురుచూపులకు శుక్రవారం ఓట్ల లెక్కింపుతో తెరపడింది. నియోజకవర్గంలో గుమ్మడిదల, జిన్నారం, గడ్డపోతారం, ఇంద్రేశం, ఇస్నాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి.

వీటిలో గుమ్మడిదలమున్సిపాలిటీ, గడ్డపోతారంలో మాత్రమే బీఆర్‌ఎస్ సంపూర్ణ మెజార్టీతో చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. గుమ్మడిదలలో 22 వార్డులకు గాను కేవలం 4 స్థానాల్లో కాంగ్రెస్ గెలువగా, 15 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలిచి ప్రభంజనం సృష్టించింది. గడ్డపోతారంలో సైతం 18 వార్డులకు 3 స్థానాల్లో కాంగ్రెస్, 14 స్థానాల్లో బీఆర్‌ఎస్ గెలుపొంది చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. అయితే ఇస్నాపూర్లో సైతం నువ్వానేనా అన్నట్లుగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య ఫలితాలు వచ్చాయి. 26 వార్డులకు గాను 10 కాంగ్రెస్, 12 బీఆర్‌ఎస్ గెలుపొందగా నలుగురు స్వతంత్రులు గెలుపొంది హంగ్ ఏర్పడింది.

ఇంద్రేశంలో 18 వార్డులకు 6 కాంగ్రెస్, 9 బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు గెలుపొందగా సరియైన మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో బీజేపీ, స్వతంత్ర అభ్యర్థులపై ఆధారపడాల్సి వచ్చింది. మొత్తంగా కొత్త మున్సిపాలిటీలలో రెండింట బీఆర్‌ఎస్ గెలుపొందగా, మరో మూడు మున్సిపాలిటీలను ఎవరు కైవసం చేసుకుంటారో ఈనెల 16 వరకు వేచి చూడాల్సిందే.