నావంగిలో హుబ్లీ ట్రైన్ నిలుపుదల.. ప్రయాణికుల సమయం, డబ్బు ఆదా
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా నవాంద్గీ రైల్వే స్టేషన్(Nawandgi Railway Station)లో హుబ్లీ ట్రైన్ నిలుపుదలతో ప్రయాణికులకు డబ్బు, సమయం ఆదా అవుతుందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తో కలిసి హుబ్లీ రైలు బషీరాబాద్ లో నిలుపుదలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడి నాయకులు, వ్యాపారవేత్తలు, ప్రముఖులు, స్థానిక ప్రజలందరి చిరకాల కోరిక హుబ్లీ ట్రైన్ బషీరాబాద్ లో నిలువాలని ఉండేదని నేటితో వారి కల నెరవేరిందని అన్నారు.
బషీరాబాద్, పరిసర గ్రామాల ప్రజలు రాష్ట్ర రాజధాని హైదరబాద్ వెళ్లేందుకు ఇబ్బందులు ఉండేవి, ఇప్పుడు హుబ్లీ ట్రైన్ నిలుపుదలతో ప్రయాణికులకు సౌకర్యం పెరగడంతో పాటు సమయం, ఖర్చు కూడా ఆదా అవుతుందన్నారు. రైలు ఆపేందుకు సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సంబంధిత అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు తదితరులు పాల్గొన్నారు,




