అమీన్‌పూర్‌లో ప్రభుత్వ భూముల కబ్జా
ప్రభుత్వ భూములను కాపాడాలి
తహసీల్దార్‌కు వినతి పత్రం అందించిన మాజీ వైస్ ఎంపీపీ, మాజీ వార్డు సభ్యు లు
అమీన్‌పూర్: అమీన్‌పూర్ జీహెచ్ఎంసీ సర్కిల్ పరిధిలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూములను ఆక్రమణల నుంచి కాపాడాలని కోరుతూ మాజీ వైస్ ఎంపీపీ కోకల శ్రీనివాస్ నేతృత్వంలో తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. అధికారులు సానుకూలంగా స్పందించి, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని కోరారు. బీరంగూడలోని ప్రసిద్ధ శంభునిగుడి సమీపంలోని సర్వే నంబర్ 783లో సుమారు 20 గుంటలు, అలాగే సర్వే నంబర్ 767లో సుమారు 3 గుంటల ప్రభుత్వ భూమి ఉందని గ్రామస్తులు పేర్కొన్నారు.
ఈ భూమిని కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్నారని, ఇప్పటికే అక్కడ ఆక్రమణలు బహిరంగంగా కనిపిస్తున్నాయని తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమిని కాపాడకపోతే భవిష్యత్తులో ప్రజా ప్రయోజనాల కోసం, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం కొరత ఏర్పడుతుందని వినతిపత్రంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత సర్వే అధికారులతో సదరు సర్వే నంబర్లలో సమగ్ర సర్వే నిర్వహించాలని కోరారు. ప్రభుత్వ భూమికి స్పష్టమైన హద్దులను ఏర్పాటు చేయాలని, అక్రమణలకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. వినతిపత్రం అందజేసిన వారిలో మాజీ వార్డు సభ్యులు సిహెచ్ లింగం గౌడ్, పట్లోళ్ల భాస్కర్ రెడ్డి, అమీన్ పూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.




