సహకార దోపిడీ?
- ఇల్లందు, గుండాల సంఘాల్లో రైతులకు చారాణా.. వ్యాపారులకు బారాణా
- అధికారులకు, డైరెక్టర్లకు భారీగా కమీషన్లు?
- రైతులను నిండా ముంచుతున్న సిండికేట్
- రైతుల పేరుతో గన్నీ బ్యాగులు.. రహస్యంగా వ్యాపారులకు
- లారీకి రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు కమీషన్?
- ఖరీఫ్ సీజన్‌లోనే గుండాలలోనే రూ.8 లక్షలు కమీషన్లు!
- కలెక్టర్, విజిలెన్స్ సార్లూ.. జర దృష్టి సారించండి!
భద్రాద్రి కొత్తగూడెం, మే 6 (విజయక్రాంతి): సహకార సంఘాలు ఏర్పాటు చేసి, దళారులు, వ్యాపారుల దోపిడీని నిర్మూలించాలనే ప్రభుత్వ ప్రయత్నాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నీరుగారుతున్నాయి. రైతులకు చారాణా, వ్యాపారులకు బారాణా అన్న చందాన..సహకార సంఘాల అధికారులకు, డైరెక్టర్లకు వ్యాపారుల నుంచి భారీగా కమీషన్ల వరత కొనసాగుతోంది. రైతులకు సహకారం ఏమో గానీ వీరి మధ్య దోపిడీలో సహకారం పర్వం కొత్తపుంతలు తొక్కుతోంది.
రైతుల పేరుతో గన్నీ బ్యాగులు.. రహస్యంగా వ్యాపారులకు చేరవేస్తున్నట్లు, లారీకి రూ.45 వేల నుంచి రూ.60 వేల వరకు కమీషన్ దొబ్బేస్తున్నట్లు సమాచారం. ఈ రకంగా ఖరీఫ్ సీజన్ లోనే గుండాలలోనే రూ.8 లక్షలు కమీషన్లు అధికారులు మెక్కినట్లు ఆరోపణలు వస్తున్నా యి. జిల్లావ్యాప్తంగా సహకార సంఘాల అధికారులతో వ్యాపారులు లోపాయకారి ఒప్పం దాలు కుదుర్చుకొని కోట్ల రూపాయలు దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.
ప్రధానంగా ఇల్లందు, గుండాల సహకార సంఘాల్లో వ్యాపారుల దోపిడీకి అడ్డూఅదుపూ లేదని బహిరంగంగానే ప్రచారం సాగుతోంది. ప్రభుత్వం సహకార సంఘాల ద్వారా చేపట్టిన ధాన్యం కొనుగోలు కేంద్రాలు వ్యాపారుల పాలిట కల్పతరువుగా మారాయని తెలుస్తోంది.
అప్పుల పేరుతో రైతుల వద్ద ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు రైతుల పేరుతో సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, దోపిడీకి తెరలేపుతున్నారని తెలుస్తోంది. విజిలెన్స్ విచారణ చేస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, కలెక్టర్ సారు.. జరదృష్ట సారించండి అంటూ రైతులు, స్థానికులు వేడుకుంటున్నారు.
దోపిడీ ఇలా!?
వ్యాపారులు ముందుగా అప్పులు పెట్టిన రైతుల నుంచి పెంటకు ఒక ధరను నిర్ణయించుకుంటారు. ప్రభుత్వ మద్దతు ధరకు భారీగా వ్యత్యాసం ఉండేలా చూస్తారు. సహకార సంఘాల అధికారుల నుంచి వ్యాపారులు ముందస్తుగా గన్నీ బ్యాగులను రహస్యంగా తీసుకుంటారు. వాటిని వ్యాపారులు అప్పులు పెట్టిన రైతులకు సరఫరా చేస్తారు. వ్యాపారులు కొనుగోలు చేసిన ధాన్యాన్ని, మొక్కజొన్నలను రైతుల పేరుతో సహకార సంఘాల కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి, దోపిడీకి తెర లేపుతుంటారు.
రికార్డుల్లో రైతులు ఉంటారు, వాస్తవానికి ఆ ధాన్యంపై వచ్చే పైకం చేరేది వ్యాపారులకే. అందుకు సహకరించిన సహకార సంఘం అధికారులకు భారీగా కమిషన్లు ముట్టచెపుతుంటారు. దీంతో వారికి లక్షల రూపాయల్లో కమీషన్ అందుతున్నట్లు తెలుస్తోంది. గత ఖరీఫ్ సీజన్‌లో గుండాల సొసైటీలో సుమారు 200 నుంచి 250 లారీల మొక్కజొన్నలను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఒక్కొక్క లారీకి రూ.45 వేల నుంచి రూ.50వేల వరకు కమీషన్ రూపంలో సొసైటీ అధికారులకు ముట్ట చెప్పినట్లు ఆరోపణలు వెలువడుతున్నాయి.
అంటే ఒక్క మొక్కజొన్నల పైనే అధికారులకు రూ.8లక్షల నుంచి రూ.9 లక్షల పైచిలుకు చేతులు మారినట్లు తెలుస్తోంది. మొక్కజొన్నలోనే ఈ తీరు ఉంటే ధాన్యం, ఎరువులపై దండుకుంటున్న కమీషన్ ఎంత అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇల్లందు సొసైటీ ఒక అడుగు ముందుకు వేసి ఒక్కొక్క లారీకి రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు కమీషన్లు అందుతున్నట్లు తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రతి సహకార సంఘంలోనూ ఇదే తరహా దోపిడీ జరుగుతుందన్నడానికి ఇల్లందు గుండాల సొసైటీల కమీషన్ల పర్వమే నిదర్శనంగా నిలుస్తుంది.
అప్పునకు మించి ధాన్యం కొనుగోలు
రైతుల అవసరానికి అప్పు ఇచ్చిన వ్యాపారులు అప్పుకు మించి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని సహకార సంఘంలో విక్రయించి రైతులను నిండా ముంచుతున్నారు. దీంతో పాటు రైతుకు ఇచ్చిన అప్పుపై వడ్డీ వసూలు చేస్తున్న వ్యాపారులు, రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంపై ఇవ్వవలసిన పైకంపై నయా పైసా వడ్డీ చెల్లించకుండా నెలల తరబడి లెక్కల పేరుతో తిప్పుతుంటారు. లేదంటే రైతుకు అవసరమైన వస్తువులను ఇచ్చి జమ చేసుకొని మరోరకమైన దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు.
విజిలెన్స్ దృష్టి సారించాల్సిందే..
గుండాల, ఇల్లందు సహకార సంఘాల్లో జరుగుతున్న దోపిడీపై విజిలెన్స్ అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారిస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రైతులు దగా పడకుండా ఉండటానికి రాయితీపై ఎరువులు, మద్దతు ధరతో ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేస్తుంటే వ్యాపారులు అప్పుల నెపంతో రైతులను నిలువునా దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. విజిలెన్స్ అధికారులు ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేస్తే తప్ప వాస్తవాలు వెలుగులోకి రావని దగా పడుతున్న రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కమీషన్ తలా పిరికెడు
వ్యాపారుల నుంచి దండుకున్న కమీషన్‌ను ‘తిలా పాపం తలా పిరికెడు’ అన్న ట్లుగా సహకార సంఘాల అధికారులు, డైరెక్టర్లు తీరు ఉంది. వచ్చిన కమీషన్ ఎవరికీ ఇబ్బంది లేకుండా దర్జాగా కార్యదర్శి, సీఈవో, మేనేజర్, డైరెక్టర్లు సమపాళ్లలో పంచుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వ్యాపారుల దోపిడీకి కొన్ని రాజకీయ పార్టీల అండదండలు దండిగా ఉన్నాయని తెలుస్తోంది. ఎర్రజండా చేతబట్టి దోపిడీ వ్యవస్థ నిర్మూలనే లక్ష్యంగా పోరాడుతున్నట్లు చెబుతున్న పార్టీల నాయకులకు కళ్ల ఎదుట జరుగుతున్న వ్యాపారుల దోపిడీ కనిపించడం లేదా? వారిచ్చే కమీషన్లతో కళ్లు మూసుకుపోయాయా? అనే విమర్శలు వస్తున్నాయి.
విచారణ చేయిస్తాం: డీసీఓ ప్రేమ్‌కుమార్
గుండాల సహకార సంఘం ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరుగుతున్న అక్రమాలపై జిల్లా పౌరసరఫరాల అధికారి(డీసీఓ) ప్రేమ్ కుమార్‌ని ‘విజయక్రాంతి’ వివరణ కోరగా స్పందించారు. రైతులకు ఇవ్వాల్సిన గన్నీబ్యాగ్స్ వ్యాపారులకు రహస్యంగా సరఫరా చేస్తున్నట్లు, ఒక్కొక్క లారీకి రూ.50 వేల వరకు కమీషన్లు తీసుకుంటున్నట్లు వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించింది. దీంతో తదితర అక్రమాలపై విచారణ చేయించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని డీసీఓ ప్రేమ్‌కుమార్ తెలిపారు.






