లేడీ సింగం సుమతి!
దిల్‌సుఖ్‌నగర్‌లో మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ ‘అండర్ కవర్’ ఆపరేషన్
సాధారణ మహిళగా వీధుల్లోకి వచ్చిన సీపీ
పోకిరీల- వెకిలి చేష్టలు, బూతు మాటలు, అసభ్యకర సంజ్ఞలు
మహిళలను వేధిస్తున్న 40 మంది యువకుల అరెస్టు.. కౌన్సిలింగ్
ఎల్బీనగర్, మే 6: రాత్రి సమయంలో అమ్మాయి కనిపిస్తే చాలు.. ఏ వయస్సు అని తేడా లేకుండా.. వస్తావా? రేటు ఎంత?.. ఇద్దరం, నలుగురం ఉన్నాం.. అంటూ వెకిలిచేష్టలు, బూతు మాటలు.. అసభ్యకరమైన సంజ్ఞలు. చీకటిపడితేచాలు వీధుల్లో వెళ్లే ఆడపిల్లలకు వేధింపులు తప్పని పరిస్థితి. హైదరాబాద్‌లో.. దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురిలోని రద్దీ ప్రాంతాల్లో ఇటీవల మహిళలకు అర్ధరాత్రి అయితే చాలు పోకిరీల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని అనేక ఫిర్యాదులు వచ్చాయి.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్‌గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన సుమతి.. తన మొదటి ప్రాధాన్యత మహిళల భద్రత అని చెప్పా రు. ఇందులో భాగంగా మూడు రోజుల పాటు దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ప్రాంతం లో పోకిరీలపై నిఘా పెట్టారు. గురువారం రాత్రి పోలీస్ కమిషనర్ స్వయంగా రంగంలోకి దిగారు. -
సాధారణంగా పోలీసుల పెట్రోలింగ్ వాహనాలను చూసి పోకిరీలు పారిపోతుంటారు. అలాంటివారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలని సీపీ సుమతి నిర్ణయించుకున్నారు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత సీపీ సుమతి సాధారణ దుస్తుల్లో, ఒక సామాన్య మహిళలాగా దిల్‌సుఖ్‌నగర్ మెయిన్ రోడ్డుపై బస్సుకోసం వేచి చూస్తున్నట్లుగా నిల్చున్నారు.
వస్తావా నీ రేటెంత..?
సీపీ సుమతి ఒంటరిగా ఉండటం చూసిన ఆకతాయిలు.. ఆమెను గుర్తించక, ఎవరో సాధారణ మహిళ అనుకొని.. బైకులపై వచ్చి చుట్టుముట్టారు. అసభ్యకరమైన సైగలు చేస్తూ.. వస్తావా నీ రేటెంత? అని అడుగుతూ ఆమెను వేధించడం మొదలుపెట్టారు. అక్కడి నుంచి సీపీ సుమతి కది లినా, కొంతదూరం వరకు పోకిరీలు ఆమె ను వెంబడిస్తూ వేధించారు. వారి ప్రవర్తనను ఆమె క్షుణ్ణంగా గమనించారు.
ఆమె సీపీ అని తెలవక వారంతా మరింతగా రెచ్చిపోయారు. మూడున్నర గంటల పాటు ఇదే తంతు. సుమారు 40 మందికి పైగా విద్యార్థులు, ఇతరులు సీపీ సుమతిని వేధింపులకు గురి చేశారు. చాలా మంది మద్యం, గంజాయి మత్తులో ఉన్నారు. కొంతదూరం వరకు ఆమెను వెంబడిస్తూ వేధించిన వారి ప్రవర్తనను ఆమె గమనించారు.
ఆ వెంటనే సమీపంలోనే మారు వేషంలో సిద్ధంగా ఉన్న ఇతర పోలీసులకు సిగ్నల్ ఇచ్చారు. వారందరినీ అదుపులోకి తీసుకుని, కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే, అక్కడ నిఘాపెట్టాల్సిన మొబైల్ పెట్రోలింగ్ పోలీసులు అటు వైపు కన్నెత్తి చూడలేదు. చివరికి తెల్లవారుజామున 3.30 గంటలకు బీట్ కానిస్టేబుల్ వచ్చి పరిస్థితిని గమనించాడు.
మూడురోజులుగా ప్రత్యేక నిఘా..
దిల్‌సుఖ్‌నగర్ పరిసరాల్లో హాస్టల్స్‌లో ఉంటున్న బ్యాచిలర్స్ రాత్రయితే ఇలా రోడ్లమీద తిరుగుతున్నట్టు గుర్తించిన సీపీ సుమతి.. మూడురోజులుగా దిల్‌సుఖ్‌నగర్ బస్టాండ్ ఏరియాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. స్వయంగా సీపీ.. సాధారణ మహిళగా స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. ఆకతాయిల నుంచి వేధింపులను ఎదుర్కొన్నారు. ‘రోడ్డుపై ఆడపిల్ల కనిపించగానే చొంగ కార్చడం కాదు..
చొరవ తీసుకుని వీలైతే సాయం చేయాలి అని పోకిరీలకు కౌన్సిలింగ్ సందర్భంగా సూచించారు. చదువు, కెరీర్ మీద ఫోకస్ చేయాలని ఆ యువకులకు సూచించారు. మత్తు అలవాట్లను వదిలి చదు వు, ఉద్యోగంపై దృష్టి సారించి, ఉత్తమ పౌరులుగా ఎదగాలని హితవు చెప్పారు. పట్టుబడ్డ వారిలో ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఉండటం గమనార్హం.
కౌన్సెలింగ్, కేసులు..
పట్టుబడిన పోకిరీలపై కేసులు నమోదు చేయడమే కాకుండా, వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహించి.. పబ్లిక్ ప్లేస్లలో మహిళల పట్ల ఎలా ప్రవర్తించాలో గట్టిగా హె చ్చరించారు. పోలీసులు యూనిఫాంలో ఉ న్నా, లేకపోయినా.. ప్రతి చోటా మహిళల రక్ష ణ కోసం నిఘా ఉంటుందని భయం కలిగించడమే ఈ ఆపరేషన్ ప్రధాన ఉద్దేశమని పోలీసులు పేర్కొన్నారు.
ఈ ఘటన తర్వాత హైదరాబాద్ మహిళల భద్రతపై తీసుకుంటు న్న చర్యలపై ప్రజల్లో నమ్మకం మరింత పెరిగింది. చదువుకోవాల్సిన యువకులు రాత్రి వే ళల్లో పోకిరీ చేష్టలు చేస్తుండడం ప్రజలను ఆం దోళనకు గురిచేస్తున్నది. దిల్‌సుఖ్‌నగర్ ప్రాం తంలో ఎక్కువగా హాస్టల్స్ ఉండడంతో యువకులు ఈవ్ టీజింగ్‌కు పాల్పడుతున్నారు.






