7 May, 2026 | 3:05 AM

హామీల అమలు సున్నా

07-05-2026 02:05 AM

వరంగల్ రైతు సంగ్రామ సభ

రైతు డిక్లరేషన్ 34 హామీల్లో ఒక్కటి కూడా అమలు కాలేదు

  1. మక్కలు కొనకపోతే కాంగ్రెస్ సర్కార్ ముక్కలే
  2. కాళ్లు పట్టుకోకండి.. కాలర్ పట్టుకోండి 
  3. ఎనుముల రేవంత్ కాదు.. ఎగవేతల రేవంత్
  4. రైతుల రక్తం తాగిన పార్టీ కాంగ్రెస్
  5. ఇసుక కోసం.. చెక్ డ్యాంలను పేల్చివేస్తున్నారు 
  6. రాబందు రాజ్యం పోయి వచ్చేది రైతుబంధు రాజ్యం
  7. వరంగల్ రైతు సంగ్రామ సభలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

* వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా విజయవంతం అవుతుంది. ఇది పౌరుషాల గడ్డ, కాళోజీ, జయశంకర్ సార్ స్ఫూర్తితో పోరాటాల ఓరుగల్లు విల్లుతో ద్రోహుల గుండె ఝల్లుమనడం ఖాయం.

* కాంగ్రెస్ పార్టీ రైతుల రక్తం తాగిన పార్టీ. రైతులకు ఇచ్చిన 34 హామీల్లో ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు కాలేదు. కాంగ్రెస్ పార్టీ మోసాలకు, కుట్రలకు కేరాఫ్.. ఆ విషయం తెలిసి కూడా నమ్మి తెలంగాణ రైతులు దారుణంగా మోసపోయారు.

* ఏ ఊరికైనా వెళ్దాం.. రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే పదవికి రాజీనామా చేస్తా. నా ఛాలెంజ్‌ను రేవంత్‌రెడ్డి స్వీకరిస్తారా? మంత్రి తుమ్మల స్వీకరిస్తారా..?’ 

 కేటీఆర్ సవాల్

మహబూబాబాద్, మే 6 (విజయక్రాంతి): రైతు డిక్లరేషన్ పేరుతో వరంగ ల్‌లో సభపెట్టి కాంగ్రెస్ పార్టీ రైతులకు దొంగ హామీలు ఇచ్చి నాలుగేళ్లు పూర్తయింది, 34 హామీల్లో ఏ ఒక్కటి కూడా రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయలేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు విమర్శించారు. హామీలు ఇచ్చిన రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఎటుపోయారని, వారు ఇచ్చిన హామీలను అమలు చేసేంతవరకు వదిలిపెట్టేది లేదని, అందుకే పోరాటాల గడ్డ వరంగల్ నుంచి రైతు సంగ్రామ సభ ఏర్పాటుచేసి ప్రభుత్వంపై పోరాటాల విల్లు ఎక్కిపెట్టామని ఆయన తెలిపారు.

వరంగల్ నగరం లోని హంటర్ రోడ్డులో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన రైతు సంగ్రామ సభలో కేటీఆర్ ప్రసంగించారు. రైతు డిక్లరేషన్ బోగస్ పత్రమని, రైతుల హామీలను ప్రభుత్వానికి గుర్తు చేసేందుకే రైతు సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. వరంగల్‌లో ఏది మొదలుపెట్టినా విజయవంతం అవుతుందని.. పౌరుషాల గడ్డ, కాళోజీ, జై శంకర్ సార్ స్ఫూర్తితో పోరాటాల ఓరుగల్లు విల్లుతో ద్రోహుల గుండె ఝల్లుమనడం ఖాయమని ఆయ న పేర్కొన్నారు.

‘ఏ ఊరికైనా వెళ్దాం.. రైతులందరికీ రుణమాఫీ జరిగిందంటే తాను పదవికి రాజీనామా చేస్తా. ‘నా ఛాలెంజ్‌ను రేవంత్‌రెడ్డి స్వీకరిస్తారా..? మంత్రి తుమ్మల స్వీకరిస్తారా..?’ అని కేటీఆర్ సవాల్ విసిరారు. రుణమాఫీ చారాన, టోపీ బారాణాగా మారింది, రైతులు రుణమాఫీ కోసం బ్యాంకుల్లో పురుగుల మందులు తాగిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. రైతులకు ఇవ్వడానికి పైసలు లేవన్నారు.. ఢిల్లీకి మాత్రం మూటలు మోసుకెళ్తున్నారు.

మూటలు మోసుకెళ్లే రేవంత్‌కి యూరియా బస్తాలు తెచ్చే తెలివి లేదు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులు కాళ్లు పట్టుకోవద్దని.. కాలర్ పట్టుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. మక్కలు, ధాన్యం కొనుగోలుకు రైతులు పడిగాపులు పడుతున్నారని, లక్సెట్టిపేటలో గోడ కూలి నలుగురు రైతులు చనిపోయారని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో వెనుకటి రోజులు మళ్లీ వచ్చాయని విమర్శించారు. మక్కలు కొనకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ముక్కలవుతుందని హెచ్చరించారు.

మోటార్లకు మీటర్లు పెట్టమంటే కేసీఆర్ కేంద్రంతో లొల్లి పెట్టుకున్నా రని, ఇప్పుడు రేవంత్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నారన్నారు, రైతులు కాంగ్రెస్ నయవంచనకు బలి కావద్దని, రైతులు గుండె ధైర్యం కోల్పోవద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాబందు రాజ్యం పోతుందని, కేసీఆర్ రైతుబంధు రాజ్యం తిరిగి వస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా

మంచిర్యాల జిల్లాలో కొనుగోలు కేంద్రాల వద్ద.. రెండు వేర్వే రు సంఘటనల్లో నలుగురు రైతు లు మృతిచెందడం బాధాకరమని కేటీఆర్ అన్నారు. రైతుల ప్రాణాలు గాలిలో దీపాలా..? అని కాంగ్రె స్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వారాల తరబడి పండించిన పంట కొనకుండా ప్రభుత్వం అలసత్వం వహిస్తోం దని మండిపడ్డారు. మృతి చెందిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షలు,  గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్య సహాయం అం దించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.

మూడురోజుల్లో వివిధ కొనుగోలు కేంద్రా ల వద్ద ఏడుగురు రైతులు మరణించారని.. అవన్నీ సర్కార్ హత్యలేనని ఆరోపించారు. కేసీఆర్ పరిపాలనలో రైతులను, వ్యవసాయ రంగాన్ని దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ స్థానంలో నిలిపితే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంతా ఆగమైందన్నారు. దేశంలో రైతును బాగా చూసుకున్న నాయకుడు కేసీఆర్ మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ నాయ కత్వంలో రైతు ప్రగతి విప్లవం సృష్టించామన్నారు.

10 ఇళ్లలో రైతులకు ఐదు లక్షల రూపాయల కోట్లు ఖర్చు పెట్టాడని చెప్పారు. కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తెచ్చి సాగు విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచితే, ప్రస్తుత ప్రభుత్వం ఇసుక కోసం పొలాలకు నీళ్లు ఇచ్చే చెక్ డాంలను పేల్చి వేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు భూము ల రేట్లు భారీగా పెరిగితే ఇప్పుడు భూము ల రేట్లు పూర్తిగా తగ్గిపోయాయని కేటీఆర్ అన్నారు.

రైతులు కష్టపడి పండించిన పంటలను కొనేందుకు అనేక సాకు లు వెతుకుతున్నారని విమర్శించారు. ఎకరానికి 26,500 రైతులకు ప్రభుత్వం బాకీ పడిందని, ఇచ్చిన వరంగల్ రైతు డిక్లరేషన్ హామీల ప్రకారం ఆ మొత్తం రైతులకు చెల్లించేంతవరకు ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు.

రాబందు కాంగ్రెస్ పాలనలో 1000 మంది రైతులు చనిపోయా రని, రోడ్డున ద్రౌతున్న పడ్డ ప్రతి రైతు కుటుంబానికి 10 లక్షల పరిహారం ఇవ్వాలని, అన్ని పంటలకు ఆంక్షలు లేకుండా 500 రూపాయల బోనస్‌తో కొనుగోలు చేయాలని, యూరియా యాప్ రద్దుచేసి షాపుల్లో యూరియా అందించాలని, రెండు లక్షల రూపాయల రుణమాఫీ పూర్తికాని రై తులకు రుణ విముక్తి కల్పించాలని, కేసీఆర్ తెచ్చిన రైతు బీమా పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని, ఎగ్గొట్టిన పెట్టుబడి సా యాన్ని బాకీ తో సహా తీర్చాలని రైతు సంగ్రామ సభలో తీర్మానించారు.

రైతుల రక్తం తాగిన పార్టీ.. 

కాంగ్రెస్ రైతుల రక్తం తాగిన పార్టీ అని, రైతులకు ఇచ్చిన 34 హామీల్లో ఏ ఒక్కటి సక్రమంగా అమలు కాలేదన్నారు. కాంగ్రెస్ అనేది మోసాలకు, కుట్రలకు కేరాఫ్ అని.. ఆ విషయం తెలిసి కూడా నమ్మి రైతులు దారుణంగా మోసపోయారని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ కరెంట్ కంటే డేంజర్ అని చెప్పారు. ఎకరానికి 15వేలు ఎందు కు ఇవ్వట్లేదని, రైతులందరికీ రూ.౨ లక్షల రుణమాఫీ జరగలేదని, అన్ని పంటలకు బోనస్ ఇచ్చి కొంటామన్నారు,

కౌలు రైతుకు ఏడాదికి ఎకరానికి 14వేలు ఇస్తామన్నారు, రైతు కూలీలకు 12వేలు ఇస్తామన్నారు, అసైన్డ్ భూములకు పట్టాలిస్తామన్నారు, పంటల బీమా పథకం అమలు చేస్తామన్నారు, ఇందులో ఏ ఒక్కటి కూడా అమలుచేయకుండా రైతు డిక్లరేషన్ పేరుతో చిత్తు కాగితం ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ‘రైతు డిక్లరేషన్ అమలుచేయని రాహుల్ గాంధీ, రేవంత్‌రెడ్డి ఫొటోలను బస్టాండ్లలో.. రైల్వే స్టేషన్లలో అంటించాలి.

దాని కింద దొంగలున్నారు జాగ్రత్త అని రాయాలి’ అని అన్నారు. రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను రాహుల్‌గాంధీకి కప్పం కడుతున్న రేవంత్ రెగ్యులర్ సీఎం కాదు.. రెన్యువల్ సీఎం అని అన్నారు. ప్రతినెలా కప్పం కట్టి రేవంత్ తన పదవిని రెన్యువల్ చేసుకుంటున్నా రు. రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రయోజనం కలగలేదని, యూరియా ఇవ్వకుండా ఇబ్బందులు పెట్టారని, తుబంధుకు ఎగనామం పెట్టారని కేటీఆర్ చెప్పారు.

యూరియా యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కరోనా కంటే ప్రమాదకరమైందని విమర్శించారు. కేసీఆర్ పరిపాలనలో 11 విడతలుగా 73 వేల కోట్ల రూపాయలు ఇచ్చారని, కాంగ్రెస్ ప్ర భుత్వం పంచాయతీ ఎన్నికలకు ముందు ఒక్కసారి రైతు భరోసా ఇచ్చారని, ఆ తర్వాత ఎగబెట్టాడని విమర్శించారు.

రైతు డిక్లరేషన్ అమలుచేస్తామని వరంగల్ కు వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టు పెట్టి రుణమాఫీ చేస్తామని ప్రకటించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఏతు ల రేవంత్ రెడ్డిగా మారాడని విమర్శించారు. ఆయన ఎనుముల రేవంత్‌రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని ఎద్దేవా చేశారు.