క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యలు శుభపరిణామం
షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
షాద్ నగర్ ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్
షాద్‌నగర్,(విజయక్రాంతి): మహిళల్లో వేగంగా విస్తరిస్తోన్న గర్భాశయ ముఖ ద్వార (సర్వైకల్) క్యాన్సర్ ముందస్తు నివారణ చర్యల్లో భాగంగా ప్రభుత్వం చేపట్టిన హెచ్‌పీవీ టీకా మందు వల్ల మహిళలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పేర్కొన్నారు. 14 ఏళ్ల బాలికలకు పంపిణీ చేసేందుకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో హెచ్‌పీవీ టీకా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంచనంగా ప్రారంభించారు.
డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ విజయలక్ష్మి, ఆస్పత్రి డాక్టర్ విష్ణువర్ధన్ తదితరుల ఆధ్వర్యంలో ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో మొదటి హెచ్పీవీ టీకా డోసును బాలికకు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సమాజంలో ప్రస్తుతం క్యాన్సర్ మహమ్మారి పెరిగిపోతుందని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని పారదోలవడానికి ఎంతో కృషి చేస్తున్నాయని అన్నారు. వ్యాక్సిన్ వేయించుకునేందుకు బాలిక తన తల్లిదండ్రుల తోసహా ఆరోగ్యకేంద్రానికి ఆధార్ కార్డుతోసహా రావాలనీ, నిర్ణీత ఫారంలో వివరాలను నింపిన తర్వాత వాటిని ఆధార్ కార్డుకు లింకైన ఫోన్ నంబరుతో యువిన్ పోర్టల్‌లో నమోదుచేసి ఆయుష్మాన్ భారత్ (అభా)ఐడీని ఇస్తారన్నారు.
దీని ఆధారంగా బాలిక ఫోటోను నిర్ధారించుకుని టీకామందు వేస్తారనీ, ఆ వెంటనే వ్యాక్సిన్ వేయించుకున్నట్టుగా బాలికకు యువిన్ పోర్టల్‌లో సర్టిఫికెట్ జారీఅవుతుందనీ ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ బస్వం, వైస్ ఛైర్మన్ అందె మోహన్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బాబర్ అలీ ఖాన్, డిప్యూటీ డీఎంహెచ్ఓ విజయలక్ష్మి, మాజీ మున్సిపల్ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, మాజీ జడ్పీటీసీ విశాల శ్రవణ్ రెడ్డి, కౌన్సిలర్లు మురళీ మోహన్(అప్పి), దిలీప్,బచ్చలి నరేష్ ముబారక్ అలీ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.




