31 May, 2026 | 1:06 AM

తెలంగాణ పదం ఎంత పాతది?

31-05-2026 12:25 AM

దక్కన్ పీఠభూమిలో దొరికిన చారిత్రక పూర్వయుగపు ఆనవాళ్ల వల్ల మానవుడి ఉనికి 15 నుంచి 12 లక్షల సంవత్సరాల ముందు నుండే లభిస్తుందని చెప్పాలి. దక్కన్ రాజులు, రాజ్యాల ఉనికిని రామాయణ, భారతేతిహాసాలు ప్రస్తావిస్తున్నాయి. బౌద్ధమత సాహిత్యంలో, పౌరాణిక సాహిత్యంలో దక్కన్ ప్రాంతాలను పాలించిన పాలకులు పేర్కొనబడ్డారు. వేదాలలో దక్షిణాపథం ప్రస్తావన ఉంది. శాతవాహన పూర్వయుగపు రాజ్యపాలకుల నుంచి కాకతీయ పాలకుల వరకు రాజవంశాల గురించి చాలా వివ రంగానే తెలుస్తున్నది. కాకతీయానంతర పాలకులైన ముసునూరినాయకులు, వెలమనాయకులు, రెడ్డి రాజులు, బహమ నీలు, కుతుబ్షాహీలు, ఆసఫ్షాహీల పాలనల గురించి వివరంగానే చరిత్ర లభిస్తున్నది.

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం త్రిలింగాల తావులుగా ప్రసిద్ధ క్షేత్రాలు. ఈ మూడు లింగక్షేత్రాల నడుమ ఉన్నది త్రిలింగ దేశమని అప్పకవివంటి కొందరు సాహిత్యకారులు చెబుతుంటారు. త్రిలింగ అనే పదం వాడుకలోకి తీసుకొచ్చిం ది విన్నకోట పెద్దన్న తన ‘కావ్యాలంకారచూడామణి’లో త్రిలింగదేశమంటే తెలుగుదేశమని అర్థం లేదు. త్రిలింగపదం నుంచి తెలుగు పుట్టలేదు. త్రిలింగక్షేత్రాల ప్రాచీనత పౌరాణికంగా పురాతనమనిపించినా చారిత్రకంగా మధ్యయుగాల కన్నా ముందరిది కాదు. పండితులు కల్పించిన గంభీరనా మం త్రిలింగదేశం. నన్నయభారతంలో ఎక్కడా త్రిలింగదేశనామాన్ని ప్రస్తావించ లేదని చెబుతుంటారు. 

త్రికళింగనే తిలింగగా, తెలింగగా మారిందని చరిత్ర రచయితలు అభిప్రాయపడ్డారు. మూడు కళింగాలుండేవి ఉత్తర, మధ్య, దక్షిణ కళింగ దేశాలు. గోదావరికి ఇవతల ఉన్నవారే తెలింగులు. (త్రికళింగ దేశ చరిత్ర- కె.ఎస్. చలం)

తెలింగ లేదా తెలుంగు అనే పదం ఆణెముతో (=దేశము, రాజ్యము, మాగాణి) కలిసి తెలింగాణెము లేదా తెలుంగాణెము అనే పేరు ఏర్పడింది. తెలింగ లేదా తెలుంగు పేర్లు ఎక్కడివి? గోదావరికి ‘తెలిగాహ’ అనే పేరు ఉంది. తెలివాహ ఒడ్డున జీవించిన ప్రజలు తెలివానులుగా పిలువబడ్డారు. (మహాభారతం) తెలివాన్లే తెలిగాన్లు, తెలింగాన్లు, తెలింగులు, తెలుగులుగా పరిణామం చెందారనడానికి వీలున్నది. తెలుగుల ఆణెమే తెలంగాణం కావడం సహజం.

సంగం సాహిత్యంలో పేరుపొందిన కవి మామూలనార్ రచించిన ‘అహనానూరు,పురనానూరు’ అనే తమిళ గ్రంథాలలో క్రీ.పూ. 324- సం.ల మధ్య మౌర్యుల పక్షాన కోశర్ల వైపు నిలిచి మొహర్లతో యుద్ధం చేసిన వడుగరులు అంటే తమిళదేశానికి ఉత్తరాన ఉండేవారు. అంటే తెలంగాణావారే. తెలంగాణవారు వింధ్యపర్వతాలకు దక్షిణాపథం లోనివారే. 

దక్షిణాపథం అనేది సాతవాహనుల ‘నాణేఘాట్’ శాసనంలో పేర్కొనబడింది. తెన్ అనే ద్రావిడభాషాపదానికి  దక్షి ణం అనే అర్థముంది. వింధ్యకు దక్షిణాన నివసించిన తెన్ ప్రజలు, తెన్ గులు, తెనుగువారు వారే తెలుగువారని పిలవబడ్డారు. అక్షరవ్యత్యయం అనేది భాషాపరిణామంలో సహజం. 

బర్మా(మియాన్మార్)లో తైలాంగులు అని పిలువబడినవారు తెలంగాణావారే. అక్కడి శాసనాలలో, సాహిత్యంలో తైలాంగులు పేర్కొనబడ్డారు. వారు పాడుకునే లాలిపాటల లో తరుచుగా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చినారమని పాడుకుంటారు. కనుక తెలంగాణ అనే పదం 5,6 శతాబ్దాల నాటికే వాడుకలో వుందని చెప్పడానికి అవకాశముంది.

షోడశ జనపదాలలో అస్మక జనపదం తెలంగాణ భూభాగంలోనిదే. అస్మకను ‘మెగస్తనీస్, అరియన్, ప్లీని, టాలెమీ’ లు తమ రచనలలో ప్రస్తావించారు. ప్లీని ‘నాచురల్ హిస్టరీ’ లో గౌతమిగంగగా పిలువబడే గోదావరి ప్రాంతంలో అస్మగి తెగ వుందని పేర్కొనబడింది.

శాసనాలలో తెలంగాణ

సాహిత్యపరంగా దొరుకుతున్న ఆధారాలే కాకుండా శాసనాధారపరంగా చూసినప్పుడు తెలంగాణను ‘తెలంగాణా’ అని పేర్కొన్న శాసనాధారం తొలిసారిగా ‘తెలంగాణ’ అనే పేరు, తెలంగాణ దేశం సరిహద్దులు ముమ్మడినాయకుని క్రీ.శ.1358నాటి శ్రీరంగం రాగిరేకుల శాసనంలోని 5,6వ శ్లోకాలు, 8,10వ పంక్తులలో పేర్కొనబడ్డాయి.

(Epigraphia Indica  Vol. XIV, 1917-1918, Ins. No.3, pp. 83-96  Srirangam Plates of Mummadi Nayaka)

తమిళనాటి రంగనాథస్వామి దేవాలయానికి చెందిన 5 రాగిరేకుల (89 పంక్తుల) శాసనం ‘తెలింగాణ దేశం’ రాజు ముమ్మడి నాయకుడు 7వ పరాశర భట్టారకునికి చేసిన దానాలను పేర్కొంటుంది. శాసనంలో దాత వంశక్రమం వివరించబడింది.

తెలంగాణ అనే పేరు ప్రస్తుత సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మండల కేంద్రంలో ఒక చిన్న దిగుడు బావి ముందర వెలుగుచూసిన క్రీ.శ. 1418 జనవరి 8న అంటే శక సం.1339, హేవిళంబి నామ సం.ర మాఘ శుద్ధ దశమి నాడు చేసిన శిలాశాసనంలో ప్రస్తావించబడింది.

తెలంగాణ సాహిత్య సూచనలు

ప్రాచీన సాహిత్యం పురాణాలు: వాయు పురాణం, మా ర్కండేయ పురాణం, పద్మ పురాణం వంటి గ్రంథాల్లో త్రిలిం గ దేశం / తైలంగ దేశం ప్రస్తావన ఉంది. కల్హణుని రాజతరంగిణిలో తెలగాణ్య

గోండి మూలాలు: గోండి లిపి (దాదాపు 2000 సంవత్సరాల క్రితం)లో తెలంగాధ్ (దక్షిణం అని అర్థం) సూచన

తమిళ గ్రంథాలు

తొల్కాప్పియంలో తెలింగం

అగత్తియంలో తెలుంగం విదేశీయుల రచనలు

టాలెమీ (2వ శతాబ్దం) రచనల్లో త్రిలింగాన్

ప్లీనీ రచనల్లో త్రిలింగ

బర్మా చరిత్ర సాహిత్యంలో తైలాంగులు

ముస్లిం కాలం

మహమ్మద్ బిన్ తుగ్లక్ (1324) కాలంలో ముల్క్-ఇ-తిలంగ్ (Tilang)

మాలిక్ మఖ్బూల్ను తిలంగాని అని పిలిచేవారు.

నిజాం కాలం

తెలుగు మాట్లాడే ప్రాంతాన్ని తెలంగాణ, మరాఠీ ప్రాంతాన్ని మరాఠ్వాడాగా వేరు చేశారు.

తెలంగాణ అనే పదం పేర్కొనబడ్డ సందర్భ వివరాలు

ప్రతాపరుద్రుని సైనికాధికారి గన్నమనాయకుడు. కాకతీయుల ఓటమి తర్వాత ఇతనిని పట్టుకుని, మతం మార్చి, మాలిక్ మక్బూల్ అనే పేరు పెట్టి, ఈతనికి ఫిరోజ్ షా తుగ్లక్ (13511388) ’ఖాన్-ఎ-జహాన్ తిలంగాణీ’ అనే బిరుదు ఇచ్చాడు. కవి మారన తను రచించిన మార్కండేయపురాణమును మాలిక్ మక్బూల్ (గన్నయ)కు అంకితం ఇచ్చాడు. అప్పటికే తెలంగాణి పదం వాడుకలో ఉన్నదని ఇది రుజువు చేస్తుంది.

కాకతీయుల కాలంలో కొన్ని శాఖల బ్రాహ్మణులను తెలగాణ్యులు అనే పేరుతో పిలిచేవారు. తెలగాణ్యులనగా తెలంగాణకు చెందినవారుగా చెప్పాలి.

సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ శాసనం (క్రీ.శ.1418)లో “తెలుంగణపురం” అనే పేరు ప్రస్తావన ఉంది.

ప్రతాపరుద్ర గజపతి యొక్క వెలిచెర్ల శాసనం (క్రీ.శ.1510) తెలంగాణాను పేర్కొన్నది.

శ్రీకృష్ణదేవరాయుల తిరుమల, చినకంచి శాసనాలు.

పి. శ్రీరామశర్మ ప్రకారం, అమీర్ ఖుస్రో నుంచి అబుల్ ఫజల్ మధ్యకాలంలో అంటే స్థూలంగా అల్లావుద్దీన్ ఖిల్జీ నుంచి అక్బర్ కాలంలో తెలంగాణ అనే పేరు వ్యావహారికంగా మారింది.

ఆణెము అంటే దేశం కాబట్టి గోల్కొండ రాజ్యస్థాపన నుంచి ‘తెలంగాణ’ పదం వాడకం ప్రాచుర్యం చెందిందని సురవరం ప్రతాపరెడ్డి గారు పేర్కొన్నారు.

తెలుగు పదం ఆవిర్భావం

ప్రముఖ చరిత్రకారుడు పరబ్రహ్మశాస్త్రి గారి అభిప్రా యం ప్రకారం, తెలుంగు వారు నివసించిన ప్రాంతం కొందరిచే త్రిలింగదేశంగా వ్యవహరించబడింది.

తెలంగాణలోని జీవనది గోదావరిని పూర్వం తెలిగా హ నదిగా వ్యవహరించేవారు. తెలివాహనది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను తెలివాను లుగా, తెలింగులుగా సంస్కృతీకరించిన మాటతో త్రిలింగులుగా పిలువబడిన ప్రజల ఆవాసమే కాలక్రమంలో త్రిలింగదేశంగా పేరువడ్డది. 

గాంగ వంశస్తుడైన ఇంద్రవర్మ వేయించిన పుర్లి శాస నం నుంచి త్రిలింగ, తిలింగ, తెలింగ అనే మూడు పదాలను పర్యాయపదాలుగా వాడడం జరిగింది.