12 March, 2026 | 7:28 AM

విద్యకు విత్తమెంత?

12-03-2026 02:09 AM
  1. బడ్జెట్‌లో ప్రతిసారి 6 నుంచి 10% లోపే కేటాయింపులు 
  2.   15% నిధులు కేటాయిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీ బడ్జెట్‌లో అమలయ్యేనా?
  3. మిగతా రాష్ట్రాల కంటే మన కేటాయింపులు తక్కువే 
  4. బీహార్‌లో 18.4%, రాజస్తాన్‌లో 18% కేటాయింపులు

హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు.. స్వరాష్ట్రంలోనూ విద్యకు బడ్జెట్‌లో కేటాయింపులు ప్రతి ఏటా అరకొరగానే ఉంటున్నాయి. విద్యకు కేటాయింపుల విషయంలో నేతల మాటలు ఘనం.. చేతలు శూన్యం అన్నట్లుగా ఉన్నా యి. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ ఎన్నికల సమయంలో విద్యకు బడ్జెట్‌లో 15 శాతం నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను కలుపుకుంటే మొత్తం మూడుసార్లు వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, ఈనెలలో నాలుగోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టబోతున్నది. గత మూడు బడ్జెట్‌లలోనూ విద్యకు కేటాయింపులు కేవలం 8 శాతంలోపే ఉన్నాయి.

కనీసం 10 శాతం నిధులను కూడా విద్యకు ఇప్పటివరకు కేటాయించలేదు. ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలను ఈనెల 16వ తేదీ నుంచి నిర్వహించనున్న నేపథ్యంలో ఈసా రైనా విద్యకు 15 శాతం నుంచి 20 శాతం బడ్జెట్‌ను కేటాయిస్తారా? లేదా? అని విద్యార్థి సంఘాలు, ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రశ్నిస్తున్నారు.

విద్యపై పెట్టుబడి పెట్టని ప్రభుత్వాలు..

‘విద్య అనేది సింహపు పాలవంటిది. వాటిని తాగిన వారు గర్జించకుండా ఉండలేరు’, ‘విద్య భవిష్యత్తుకు బీమా’ వంటిదని రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క 2025  వార్షిక బడ్జెట్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలివి. విద్యకు పెట్టే కేటాయింపులు పెట్టుబడిగా చూడాలి.. కానీ, ఖర్చుగా చూడొద్దని రాష్ట్ర ప్రభుత్వం పలు వేదికలపై పదే పదే చెబుతున్న దానికి, వాస్తవ పరిస్థితికి విరుద్ధంగా ఉంది.

విద్యపై పెట్టుబడి పెట్టేందుకు ఉమ్మడి రాష్ట్రం నుంచే ఆయా ప్రభు త్వాలు సుముఖత చూపించడంలేదు. ప్రతి ఏటా బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులను నామమాత్రంగా కేటాయిస్తున్నారు. అన్ని శాఖల్లో కెల్లా అత్యంత కీలకమైన విద్యాశాఖకు గత 2025-26 బడ్జెట్ మొత్తం రూ. 3,04,965 కోట్లు కాగా, అందులో విద్యాశాఖకు రూ. 23,108 (7.57శాతం) కోట్లు మాత్రమే కేటాయించింది.

అదే 2024-25లో మొత్తం బడ్జెట్ 2,91,159 కోట్లుకాగా, అందులో విద్యకు రూ. 21,292 (7.31 శాతం) కోట్లు కేటాయించింది. 2024-25 కంటే 2025-26 బడ్జెట్‌లో 0.26 (రూ. 1816 కోట్లు) శాతం విద్యకు అధికంగా నిధులు కేటాయించి మమ అనిపించారు. అయితే కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో విద్యకు 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. తీరా బడ్జెట్‌లో కేవలం 7.57 శాతం నిధులు మాత్రమే కేటాయించారు. 

అధికశాతం నిధులు వేతనాలకే.. (బాక్స్)

బడ్జెట్‌లో విద్యకు కేటాయింపులు చేసేదే కొంత.. అందులోనూ సింహభాగం ఉద్యోగులు, సిబ్బంది వేతనాలు, నిర్వహణకే సరిపోతుంది. ఇక పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో మౌలికవసతుల కల్పన, అభివృద్ధి లాంటి వాటికి నిధులే సరిపోవడంలేదు. పైగా వీటి అభివృద్ధికి కేటాయించే అరకొర నిధులు కూడా ఆరేడు నెలలకు విడుదల చేస్తుండటం గమనార్హం. ఇక విదేశాల్లో చదువుకునే విద్యార్థులకు ఇచ్చే ఓవర్సీస్ స్కాలర్‌షిప్, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు కలిపి రూ.10 వేల కోట్ల వరకు ఉన్నాయి.

వీటన్నింటికీ నిధులు సమయానికి విడుదల కాకపోవడంతో విద్యార్థుల చదువులకు ఆటంకంగా మారింది. గత బడ్జెట్‌లో సెకండరీ ఎడ్యుకేషన్‌కు రూ. 16,298 కోట్లు, ఉన్నత విద్యకు రూ. 3009 కోట్లు ఎస్టాబ్లిష్‌మెంట్‌కే వెళ్లనుంది. స్కీమ్స్‌కు తీసుకుంటే ఉన్నత విద్యకు రూ. 635 కోట్లుకాగా, సెకండరీ విద్యకు రూ. 3,166 కోట్లు స్కీమ్స్ కోసం కేటాయించారు. ఈ బడ్జెట్‌లోనూ ఈ తరహాలోనే అరకొరగా కేటాయిస్తే బడుల్లో విద్యావసతులు గాలికొదిలేసినట్లే.

మరోవైపు బడుల్లో మధ్యాహ్న భోజన పథకం వికటిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. విద్యాశాఖ పరిధిలోని 24,997 ప్రభుత్వ స్కూళ్లలో 18.56 లక్షల మంది విద్యార్థులు చదువుతుండగా, వీరికి ఈ కేటాయింపులేం సరిపోతాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఈసారి సర్కారు బడుల్లో సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీంను, ప్రీప్రైమరీ విద్య అమలు చేయనున్నారు. విద్యార్థులకు వెల్‌కమ్ కిట్స్ ఇవ్వనున్నారు.

తెలంగాణ పబ్లిక్ స్కూళ్లకు కేటాయింపులు ఏవిధంగా ఉంటాయో చూడాల్సి ఉంటుంది. ఈక్రమంలో గతేడాది బడ్జెట్ కంటే అదనంగా కేటాయింపులు జరపాలని ప్రభుత్వానికి అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారు. అయితే కేటాయింపులు కంటితుడుపు చర్యగా కాకుండా 15-20 శాతం ఉండాలని విద్యావేత్తలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. లేకుంటే విద్యాప్రమాణాలు పడిపోయే ప్రమాదం ఉంది. విద్యాకమిషన్ కూడా కనీసం 18 శాతం నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి ఇటీవల సిఫారసు చేసింది.

పక్క రాష్ట్రాల్లో అధిక ప్రాధాన్యత.. 

మనకంటే కూడా చిన్న రాష్ట్రాలు, పక్క రాష్ట్రాలు విద్యకు బడ్జెట్‌లో అధిక కేటాయింపులు, ప్రాధాన్యత ఇస్తుండటం గ మనార్హం. ఆయా రాష్ట్రాల నుంచి మనం ఎంతో నేర్చుకోవా ల్సి ఉంటుంది. ఆఖరికి బీహార్‌లోనూ మనకన్న రెండు రెట్లు అధికంగా నిధులు కేటాయిస్తున్నారు. బడ్జెట్‌లో కేటాయింపులు ఎంత పెంచితే అంతమేర నాణ్యమైన విద్య విద్యార్థుల కు అందుతుంది.

అప్పుడే గానీ ప్రైవేట్‌తో ధీటుగా పోటీపడలేము. 2024-25 బడ్జెట్‌లో బీహార్ ప్రభుత్వం 18.4 శాతం కేటాయించగా, రాజస్థాన్ 18 శాతం, మధ్యప్రదేశ్ 16 శాతం, కేరళ 14.8 శాతం, తమిళనాడు 13.4 శాతం, ఉత్తరప్రదేశ్ 13 శాతం, కర్ణాటక 12.9 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 12 శాతం నిధులను కేటాయించారు. కానీ మనదగ్గర చూస్తే స్వరాష్ట్రం ఏర్పడిన తొలి ఏడాదిలో మాత్రం 10.89 శాతం నిధులను కేటాయించగా,మళ్లీ ఇంత వరకూ 7 శాతం కేటాయింపులు దాటలేదు. గతేడాది 7.57శాతం, అంతకుముందు 7.31 శాతం మాత్రమే కేటాయించారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా మనకంటే తక్కువగా నిధులు కేటాయించిందిలేదు.

ఈ హామీలు అమలయ్యేనా?

కాంగ్రెస్ తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో యూత్ డిక్లరేషన్‌లో భాగంగా నిరుద్యోగ భృతి, విద్యార్థులకు రూ.5 లక్షల విద్యాకార్డు, విద్యార్థినులకు స్కూటీలు, యూత్ కమిషన్‌ను అమలు చేస్తామని యువతకు కాంగ్రెస్ పార్టీ నాడు ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ, గత రెండు బడ్జెట్‌లో.. ఈ హామీల ప్రస్తావనే లేకుండా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

ఈసారైనా అమలుచేస్తారో లేదో చూడాల్సి ఉంటుంది. కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి, జాబ్ క్యాలెండర్ అమలుపై ఆశగా ఎదురుచూసిన అభ్యర్థులకు  పూర్తిస్థాయిలో స్పష్టత ఇస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజు నియంత్రణకు గానూ ప్రత్యేక చట్టం రూపకల్పన గురించి ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటన చేస్తుందా? లేదా చూడాల్సి ఉంటుంది. దీనికితోడూ విద్యాకమిషన్ సిఫారసులు, తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ అమలు గురించి స్పష్టత ఇవ్వాల్సి ఉంటుంది.


విద్యకు కనీసం 15 శాతం కేటాయించాలి

కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినట్టుగా 15 శాతం నిధులను విద్యకు కేటాయిం చాలి. మరీముఖ్యంగా విద్యకు పెట్టే పైసలను ఖర్చుగా ప్రభుత్వం చూడకూడదు. అది విద్యార్థుల, రాష్ట్ర భవిష్యత్‌కు పెట్టుబడిగా చూడాలి. సీఎం వద్దనే విద్యాశాఖ కూడా ఉం డటంతో కనీసం 15 శాతానికి తగ్గకుండా ఈసారి విద్య కు కేటాయింపులు జరిపితే ప్రభుత్వ విద్య, విద్యాసంస్థలు మెరుగుపడతాయి.

 పుల్గం దామోదర్‌రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు 

15 లేదా 18 శాతం కేటాయించాలి

కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించినట్టు 15 శాతం లేదా విద్యాకమిషన్ తన నివేదికలో పేర్కొన్నట్టు 18 శాతం నిధులైనా విద్యకు కేటాయించాలి. తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, యంగ్ ఇండియా ఇంటిగ్రెటేడ్ స్కూ ళ్లు, పాఠశాలల్లో అల్పాహారం ఇస్తామని ఏదై తో అంటుందో వాటికి అనుగుణంగా నిధులను బడ్జెట్‌లో కేటాయించాలి. బడ్జెట్‌లో విద్యకు నిధులను తగ్గిస్తూ వస్తే కాంగ్రెస్ కాస్త పెంచుతూ వచ్చింది. కానీ అవి కూడా సరిపోవు. కనీసం 15 శాతం నిధులు కేటాయించాలి.

 కటకం రమేశ్, టీఆర్టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు