5 July, 2026 | 3:04 AM

గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కృషి

05-07-2026 01:23 AM
  1. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క 
  2. పలు అభివృద్ధి పనులకు శంకుస్థానలు
  3. మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేసిన మంత్రి

నిజామాబాద్, జూలై 4 (విజయక్రాంతి): గిరిజన ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టు బడి ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శనివా రం నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం వెంగల్పాడు, తిరుమనపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారన్నారు.

రాంపూర్ తండా నుంచి వెంగల్పాడు తండా వరకు 5.48 కోట్లతో బిటి రోడ్డు పను లకు, కేకే తండా నుంచి మెగ్య నాయక్ తండా వరకు 2.94 కోట్లతో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. తిర్మన్ పల్లిలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో వసతి గృహ భవన సముదాయం, కిచెన్ డైనింగ్ హాల్ లను ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. సీతక్క మాట్లాడుతూ మారుమూల గిరిజన తండాలు, గ్రామాలలో అభివృద్ధి పనుల్లో పాల్గొనడం ఎంతో సంతోషం కలుగుతుందన్నారు.

విద్యారంగా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందన్నారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి పాఠశాలకు గ్రామానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం మహిళా సంఘాలకు చెక్కులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి, జిల్లా ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హుందాన్, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కాటిపల్లి నగేష్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, అదనపు కలెక్టర్ భుజంగరావు, రాష్ట్ర వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడువు గంగాధర్, ఐడీఎస్‌ఎంఎస్ చైర్మన్ తారా చందు నాయక్, నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీపీవో శ్రీనివాసరావు, తిరుమనపల్లి సర్పంచ్ కిషన్ తదితరులు పాల్గొన్నారు.