20 April, 2026 | 4:49 AM

కాళేశ్వరం రిపేర్లు ఎలా?

20-04-2026 03:01 AM

బరాజ్‌ల నిర్మాణ లోపాలపై ప్రభుత్వం ఫోకస్

  1. అప్పుడే అప్రమత్తం చేసిన ‘విజయక్రాంతి’

మేడిగడ్డ జాతీయ విపత్తుగా అభివర్ణించిన చైర్మన్ సీఎల్ రాజం

పరిష్కార మార్గాలపై ప్రభుత్వానికి కీలక సూచనలు

తాజాగా సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో మరోసారి..

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కాళే శ్వరం ప్రాజెక్టును సందర్శించి బరాజ్‌ల పరిస్థితిని ప్రత్యక్షంగా సమీక్షించనున్న నేపథ్యంలో ‘మేడిగడ్డ జాతీయ విపత్తే’ అనే శీర్షికన 2024, అక్టోబర్ 26 తేదీన ‘విజయక్రాంతి’ పత్రిక ప్రచురించిన కథనాన్ని మరొకసారి ప్రస్తావించడం ఎంతో సందర్భోచిత అంశం. రాష్ట్రంలోని అత్యంత ప్రతి ష్టాత్మక సాగునీటి ప్రాజెక్ట్ చుట్టూ అల్లుకున్న సమస్యలు, పునరుద్ధరణ చర్యలకు మార్గనిర్దేశం చేసే అంశాలపై చర్చించాల్సిన అవసరం ఎంతో ఉంది.

గోదావరి నదిపై నిర్మితమైన మేడిగడ్డ బరాజ్ కాళేశ్వ రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో కీలక భాగం గా ఉంది. పలు జిల్లాల్లో వ్యవసాయానికి అవసరమయ్యే సాగునీరు, తాగునీరు, పరిశ్రమల అవసరాల కోసం నీటిని వినియో గించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. అయితే 2023 అక్టోబర్‌లో బ్లాక్- పియర్స్ కుంగిపోవడం వంటి నిర్మాణ వైఫల్యాలు ప్రాజెక్ట్‌లోని లోపాలను బయటపెట్టాయి.

ప్రణాళిక, డిజైన్, అమలు దశల్లో జరిగిన తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వచ్చాయి. ఒకప్పుడు ఇంజనీరింగ్ అద్భుతంగా ప్రశంసలు పొం దిన ఈ నిర్మాణం, తక్షణమే వ్యవస్థాపరమైన వైఫల్యానికి ప్రతీకగా మారి నిపుణు లు, అధికార వర్గాలు, ప్రజల దృష్టిలో చర్చనీయాంశంగా మారింది. 2024, అక్టోబర్ 26 సంచికలో ప్రచురితమైన ప్రధాన కథనంలో ‘విజయక్రాంతి’ చైర్మన్ సీఎల్ రాజం, మేడిగడ్డ రిజర్వాయర్ నిర్మాణ వైఫల్యంపై సమగ్ర విశ్లేషణ అందించారు.

ఈ ఘటనను ఒక స్థానిక ఇంజినీరింగ్ సమస్య గానే కాకుండా జాతీయ విపత్తుగా, స్పష్టమైన వ్యవస్థాపరమైన వైఫల్యంగా ఆయన అభివర్ణించడంతోపాటు విపత్తుకు ప్రధాన కారణాలను స్పష్టంగా వివరించారు. 

‘విజయక్రాంతి’ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి..

తొందరపాటు నిర్ణయాలు, సరైన భౌగోళిక, పరిశోధనల లేమి, లోపభూయిష్ట డిజైన్, నాసిరకం నిర్మాణం, రాజకీ య జోక్యం వంటి అంశాలు ప్రధాన కారణాలుగా గుర్తించారు. టెండర్ ప్రక్రియలో కొద్ది సంస్థలకు మాత్రమే అవకాశాలు కల్పించడం, ఖర్చులు రూ. 1,800 కోట్ల నుంచి రూ. 4,000 కోట్లకు పెరగడం వంటి అంశాలపై ప్రశ్నలు లేవనెత్తారు. బరాజ్ నిర్మాణంలో అనుభవం లేకుండా.. పైప్‌లైన్ అనుభవం ఉన్న సంస్థలకు కాంట్రాక్టులు ఇవ్వడం కూడా తీవ్ర విమర్శలకు గురైంది. అప్పటి పాలనలో సీఎం కార్యాలయాన్ని ఇంజనీరింగ్ డెస్‌లా ఉపయోగించారని, నిపుణుల అభిప్రాయాలు పక్కనపెట్టారని ఆయన విమర్శించారు.

మేడిగడ్డ కుంగిపోవడానికి ప్రధాన కారణం లోపభూయిష్ట డిజైన్, నాసిరకం నిర్మాణ నాణ్యత, తగిన నిర్వహణ లేకపోవడం కలిసి పనిచేయడమేనని స్పష్టం చేశారు. రిజిడ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్‌గా రూపొందించిన బరాజ్‌లో అప్‌స్ట్రీమ్, డౌన్‌స్ట్రీమ్ సీకెంట్ పైల్ కట్‌ఆఫ్‌లను రాఫ్ట్ ఫౌండేషన్‌తో సమగ్రంగా అనుసంధానించకపోవడం వల్ల సాండ్ పైపింగ్, క్యావిటీలు ఏర్పడటం, పియర్స్‌లో చీలికలు, చివరికి కుంగిపోవడం వంటి సమస్యలు వచ్చాయని వివరించారు.

ఈ అంశాలను తర్వాత ఎన్డీఎస్‌ఏ నివేదికలు కూడా ధృవీకరించాయి. కొన్ని బ్లాకుల్లో నష్టం తిరిగి సరిచేయలేనిదిగా ఉందని, శాశ్వత కాంక్రీట్ డయాఫ్రామ్ వాల్స్ ఏర్పాటు చేయాలని సూచించాయి. ముఖ్యంగా సమస్యల విశ్లేషణతోనే ఆగకుండా, మేడిగడ్డ బరాజ్‌ను కాపాడటంతోపాటు భవిష్యత్ ప్రాజెక్టుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు సీఎల్ రాజం పలు పరిష్కారాలను సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తుత పర్యటన సందర్భంగా.. ఈ సూచనలను పరిగణనలోకి తీసుకుని, పునరుద్ధరణ చర్యల్లో అమలుచేస్తారని ఆశిస్తూ ‘విజయక్రాంతి’ పత్రిక వాటిని మళ్లీ ప్రస్తావిస్తోంది.

సరిదిద్దితేనే ప్రజల్లో నమ్మకం.. 

ఎన్డీఎస్‌ఏ, విజిలెన్స్ కమిషన్లు, నిపుణుల కమిటీలు కూడా ఇవే అంశాలను వెల్లడించడం విశేషం. సమగ్ర పునరుద్ధరణ, జియో టెక్నికల్ స్టడీస్, క్యావిటీలు నింపడం, ఆధునిక మోడలింగ్ ద్వారా నిర్మాణ పునఃవిశ్లేషణ, అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బారేజీలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని ఈ సంస్థలు స్పష్టంచేశాయి. ఇటీవలి కాలంలో సీఎం కార్యాలయం కూడా మరమ్మతులను వేగవంతం చేయడం, పరిశోధన కోసం బోర్‌వెల్‌లు తవ్వించడం, బేస్ క్యాం పులు ఏర్పాటుచేయడం, సెంట్రల్ వాటర్ కమిషన్‌ను భాగస్వామ్యం చేయడం వంటి చర్యలపై దృష్టి సారించింది.

కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు తెలంగాణకు అపారమైన అవకాశాలను కలిగించిన ప్రాజెక్ట్. విస్తారమైన వ్యవసాయ భూములకు సాగునీరు అందించడం, రైతులను ఆదుకోవడం, నీటి భద్రతను కల్పించడం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యా లు. అయితే గతంలో జరిగిన తప్పిదాలను సరిదిద్దడంలో పారదర్శకత, సాంకేతిక నైపుణ్యం, బాధ్యతతో ముందుకు సాగితేనే ఈ లక్ష్యాలు సాధ్యమవుతాయి.

తాజాగా ప్రత్యక్షంగా సమీక్ష నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఈ సూచనలను అమలుచేస్తే, మేడిగడ్డ బరాజ్‌ను కాపాడటంతోపాటు మౌలిక వసతులపై ప్రజ ల నమ్మకాన్ని తిరిగి పొందడం సాధ్యమవుతుంది. ఈ సూచనలను ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి, దృఢమైన చర్యలు తీసుకోవాలని విజయక్రాంతి పత్రిక ఆశిస్తున్నది. దీని ప్రయోజనం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే కాకుండా ముఖ్యంగా నీటి వనరులపై ఆధారపడిన రైతు సమాజానికి కలుగుతుంది.

నేటి బలమైన, స్థిరమైన నిర్ణయాలు రేపటి భద్రమైన భవిష్యత్తుకు పునాది వేస్తాయి. ఒకప్పుడు జాతీయ విపత్తుగా నిలిచిన ఈ ఘటనను.. సమర్థవంతమైన పాలన, ఇంజనీరింగ్ నైపుణ్యానికి మోడల్‌గా మలచే అవకాశంగా భావించాలి. 

సీఎల్ రాజం సూచించిన కీలక పరిష్కారాలు..

* సమగ్ర భౌగోళిక, భద్రతా అధ్యయనాలు : పెద్దఎత్తున మరమ్మతులకు ముందుగా పూర్తిస్థాయి జియోలాజికల్ స్టడీస్ పూర్తిచేసి, నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ    (ఎన్డీఎస్‌ఏ) నివేదిక ఆధారంగా చర్యలు చేపట్టాలి.

* సిబ్బంది మార్పులు : ప్రాజెక్ట్‌తో అనుబంధం ఉన్న పాత అధికారులను వెంటనే మార్చి, కొత్త నిపుణులను నియమించాలి. రిపేర్ పనులకు ప్రత్యేక నైపుణ్యం       కలిగిన కొత్త కాంట్రాక్టర్‌ను తీసుకురావాలి. 

* అర్హతలున్న వారికే బాధ్యతలు : సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీవో) చీఫ్ ఇంజినీర్‌కు కనీసం 10 ఏళ్ల డిజైన్ అనుభవం ఉండాలి. కీలక బాధ్యతలు అర్హత       ఉన్నవారికే అప్పగించాలి.

* బాధ్యత నిర్ధారణ : తప్పిదాలకు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. లోపభూయిష్ట పనులు చేసిన కాంట్రాక్టర్ల లాభాల్లో కనీసం 30 శాతం             తిరిగి వసూలు చేయాలి.

దశలవారీ మరమ్మతులు: వెంటనే రిపేర్ పనులు ప్రారంభించి, దెబ్బతిన్న బ్లాకులను తొలగించడం, కొత్త డయాఫ్రాగమ్ వాల్స్ అండ్ కట్‌ఆఫ్ వాల్స్                 ఏర్పాటు, అప్రాన్ బలోపేతం చేయడం వంటి చర్యలు తీసుకోవాలి.

* పారదర్శకత, డాక్యుమెంటేషన్ : ప్రాజెక్ట్‌లో ఎదురైన సమస్యలు, తీసుకున్న పరిష్కారాలు, నేర్చుకున్న పాఠాలపై సమగ్ర వైట్ పేపర్ విడుదల చేయాలి.

* ఖర్చుల పెరుగుదలపై విచారణ : టెండర్ ఖర్చులు ఎందుకు భారీగా పెరిగాయో విచారణ జరిపి, డీపీఆర్ సిద్ధంచేసిన వ్యాప్కోస్ వంటి సంస్థల పాత్రను           పరిశీలించాలి. అవసరమైతే బ్లాక్ లిస్ట్ చేసి క్రిమినల్ విచారణ కూడా చేపట్టాలి.

* వ్యవస్థపరమైన సంస్కరణలు : భవిష్యత్ ప్రాజెక్టుల్లో అంచనాలు, ప్రీ-క్వాలిఫికేషన్, టెండర్ ప్రక్రియలో లోపాలను సరిదిద్దాలి. నిజమైన మార్కెట్ ధరలు         వెలికితీయడం, నాణ్యతను నిర్ధారించడం, రాజకీయ జోక్యాన్ని తగ్గించడం కీలకం.

చైర్మన్, విజయక్రాంతి