7 July, 2026 | 10:18 AM

కానుగ కనిపించవేమి ? మొక్క నువ్వు ఎక్కడ?

07-07-2026 09:37 AM

నర్సరీలలో పెంపకం లేక కిచెన్ గార్డెన్ లో కరువు! 

బోథ్, జూలై 7(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలు(Government schools) ఆరోగ్యపడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేయిస్తున్న ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రా జెర్సీషా ఈసారి ప్రభుత్వ పాఠశాలలో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేయించాలని నిర్ణయించారు. అందులో పిల్లలకు మధ్యాహ్న భోజనంలో ఆరోగ్యంతో పాటు శక్తిని ఇచ్చే కూరగాయలు ఆకుకూరలు వినియోగించాలని నిర్ణయించారు. ఈ విషయమై ఇప్పటికే అన్ని పాఠశాలలకు మండలస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ దిశగా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చర్యలు చేపట్టారు.

నర్సరీలలో కనిపించని కానుగ మొక్క

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో కానుగ మొక్కలను నాటించేందుకు పాఠశాలల ప్రధానోపాధ్యాయులు సిద్ధమయ్యారు. ఒకవైపు తాజా కూరగాయ మొక్కలను సాగు చేస్తూ మరోవైపు పోషకాహారాన్ని అందించే కానుగా మొక్కలను పెంచాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు కానుక మొక్కల కోసం సంబంధిత అటవీశాఖ అధికారుల వద్దకు పరుగులు తీశారు అయితే ప్రభుత్వ పరంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నర్సరీలలో కానుగ మొక్కలు లేకపోవడంతో ఉపాధ్యాయులు కానుగ మొక్కల కోసం వెతుకులాట ప్రారంభించారు. అయితే నర్సరీలలో ఎక్కడ లేకపోవడంతో జిల్లా కలెక్టర్ ఆశించిన లక్ష్యం నెరవేర్చేదిగా లేదని ఉపాధ్యాయులు మదన పడుతున్నారు. కాగా ఇతర జిల్లాల నుండి కానుగ మొక్కలను తెప్పించి నాటినట్లయితే పాఠశాలలో కానుగా మొక్కలు పెరిగే ఆస్కారం ఉంది. కానుగా కాయతో పాటు ఆకును వంటల్లో వినియోగించితే అధిక పౌష్టికాహారం అందించినట్లు అవుతుంది.

వందలోపు మొక్కలకు పాఠశాల బాధ్యత ఆపై ఈజీఎస్

పాఠశాలలో కిచెన్ గార్డెన్ లో 100 మొక్కల లోపు పెంచితే వాటిని ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాధ్యతలు తీసుకోవాల్సి ఉంది. ఆపైన ఉంటే వాటి నిర్వహణ ఉపాధి హామీ ఆధ్వర్యంలో నిర్వహించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లక్ష్యం మంచిదే ఆయన అనేక పాఠశాలలో స్థలం లేకపోవడంతో పాటు ప్రహరీ గోడ లేకపోవడంతో కిచెన్ గార్డెన్ లా నిర్వహణ ఎలాగని సతమతమవుతున్నారు