విద్యుత్ ఘాతంతో పాడి గేదె మృతి
విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని రైతు ఆరోపణ..
నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని వేడుకున్న బాధితుడు
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం ఎంతకాలం..?
అమాయక రైతులే బలికావాలా..?
జిన్నారం/అమీన్ పూర్, జులై 7: గడ్డపోతారాం మున్సిపాలిటీ పరిధిలోని మాదారం గ్రామంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ ఘాతానికి గురై ఓ పాడి గేదె మృతి చెందింది. స్థానిక రైతు పెరుగు నవీన్ యాదవ్‌కు చెందిన పాడి గేదె మేత కోసం వెళ్లిన సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబ జీవనాధారంగా ఉన్న పాడి గేదె మృతి చెందడంతో రైతు కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
గేదె మరణంతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని బాధిత రైతు వాపోయాడు. ఈ ఘటనకు విద్యుత్ శాఖ నిర్లక్ష్యమే కారణమని రైతు ఆరోపించారు. ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్ల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహించడం వల్లే ఈ ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి తగిన నష్టపరిహారం అందించి తమ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని బాధితుడు విజ్ఞప్తి చేశాడు. స్థానికులు కూడా ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ లైన్లను వెంటనే మరమ్మతులు చేసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.






