ఇంటింటా హోమ్‌స్టెడ్ ప్లాంటేషన్
- మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా సతీష్
ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఇంటింటా హోమ్‌స్టెడ్ ప్లాంటేషన్‌లో భాగంగా ప్రజలకు పంపిణీ చేసేందుకు మల్లె, గులాబీ, మందారం, చామంతి, మనీ ప్లాంట్, ఉసిరి, కరివేపాకు తదితర పూలు, పండ్ల మొక్కలను ఎంపిక చేసి పంపిణీ చేయాలని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా సతీష్ ఆదేశించారు. ఆదిలాబాద్ పట్టణంలోని హార్టికల్చర్ కళాశాల, హార్టికల్చర్ పరిశోధన కేంద్రాలను మంగళవారం డాక్టర్ మల్లేష్ తో కలిసి పరిశీలించారు. మున్సిపాలిటీ తరపున ప్రభుత్వ నిధులతో కొనుగోలు చేయనున్న మొక్కలను స్వయంగా పరిశీలించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనుషా మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలు, కళాశాలల ప్రాంగణాల్లో నాటేందుకు మునగ, నిమ్మ, జామ తదితర పండ్ల మొక్కలను సిద్ధం చేసి సరఫరా చేయాలని సూచించారు.
మున్సిపాలిటీ తరఫున కొనుగోలు చేస్తున్న ప్రతి మొక్కను నాణ్యతతో పరిశీలించి, ప్రజలకు ఉపయోగకరంగా ఉండే మొక్కలను మాత్రమే ఎంపిక చేయాలని ఆమె స్పష్టం చేశారు. పట్టణంలోని సెంట్రల్ డివైడర్ల వద్ద నాటేందుకు అనువైన మొక్కలను కూడా పరిశీలించారు. వేసవి కాలంలో ఎండిపోయిన మొక్కలను గుర్తించి తొలగించి, వాటి స్థానంలో నూతన మొక్కలను నాటాలని మున్సిపల్ అధికారులను చైర్‌పర్సన్ ఆదేశించారు. పట్టణంలో పచ్చదనం పెంపొందించడంతో పాటు ఇంటింటా మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించేందుకు మున్సిపాలిటీ ప్రత్యేక దృష్టి సారిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ అవికిరణ్, శానిటేషన్ ఇన్‌స్పెక్టర్ శంకర్,, మున్సిపల్ అధికారులు, ఆర్టికల్చర్ అధికారులు, టీఎండబ్ల్యూ ఖలీం తదితరులు పాల్గొన్నారు.






