శాస్త్రీయ పద్ధతులతో అధిక దిగుబడులు సాధించాలి
అలంపూర్, ఆగస్టు 14: పంటల రక్షణకు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త, కోఆర్డినేటర్ డా. పి.అర్చన రైతులకు సూచించారు. శుక్రవారం మానవపాడు, ఎర్రవల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో క్షేత్ర పర్యటన చేసి పత్తి, వరి, మిర్చి తదితర పంటలను పరిశీలించారు.
పంటలను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ సమీకృత పురుగువ్యాధి యాజమాన్య పద్ధతులు పాటించాలని, అవసరానికి మించి నత్రజని ఎరువులు, పురుగుమందులు వినియోగించవద్దని సూచించారు. పత్తిలో పింక్ బాల్వార్మ్, మిర్చిలో త్రిప్స్ తదితర పురుగుల నియంత్రణకు ఫెరోమోన్, స్టిక్కీ ట్రాప్లను వినియోగిం చాలని తెలిపారు. పంటల పరిస్థితిని బట్టి రైతులకు శాస్త్రీయ సూచనలు అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వీరప్ప, అధికారులు, రైతులు పాల్గొన్నారు.






