ఒకే యాప్‌లో అన్ని రకాల ఎరువులు..!
- రైతన్నకు అందుబాటులోకి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్
- యూరియా యాప్‌కు స్వస్తీ
- డీఏపీ, ఇతర ఎరువుల బుకింగ్‌కు కొత్త విధానం
కల్వకుర్తి, ఆగస్టు 14 : రైతులకు అవసరమైన ఎరువులను సులభంగా పొందేందుకు ప్రభుత్వం డిజిటల్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకు యూరియా కొనుగోళ్లకు మాత్రమే వినియోగించిన యాప్ స్థానంలో ఫ్రేమ్వర్క్ ఫర్ ఫర్టిలైజర్ సెల్ (ఎఫ్‌ఎఫ్‌ఎస్) అనే యాప్ ను తీసుకొచ్చింది. ఇకపై యూరియాతో పాటు డీఏపీ, ఇతర ఎరువులను కూడా ఒకే యాప్ ద్వారా బుక్ చేసుకుని కొనుగోలు చేయవచ్చు.
ఆధార్‌తో నమోదు
రైతులు ప్లే స్టోర్ నుంచి ఎఫ్‌ఎఫ్‌ఎస్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఆధార్ నంబర్తో నమోదు చేసుకోవాలి. అనంతరం యాప్లో రైతుకు సంబంధించిన భూమి వివరాలు కనిపిస్తాయి. సాగు చేస్తున్న పంటను ఎంపిక చేసుకున్న అనంతరం ఆ పంటకు అవసరమైన ఎరువుల వివరాలు స్క్ప్రీ ప్రత్యక్షమవుతాయి.
పంట విస్తీర్ణం ఆధారంగా రైతుకు ఎన్ని ఎరువుల బస్తాలు లభిస్తాయో ఈ యాప్లోనే చూపిస్తుంది. అవసరమైన ఎరువులను ఎంపిక చేసుకుని సంబంధిత డీలర్ వివరాలు అందుబాటులోకి వస్తాయి. చివరగా జనరేట్ అయ్యే క్యూఆర్ కోడ్ను డీలర్కు చూపించి నిర్ణీత ధరలకు ఎరువులను కొనుగోలు చేసుకునే వెసులుబాటు లభిస్తోంది.
రైతులకు అవగాహన
కొత్త యాప్ వినియోగంపై వ్యవసాయ శాఖ అధికారులు రైతు వేదికల్లో ఎరువుల విక్రయదారులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల దుకాణాల వద్ద వాలంటీర్లను ఏర్పాటు చేసి యాప్ డౌన్లోడ్, బుకింగ్ ప్రక్రియలో సహకరించాలని వ్యాపారులకు సూచిస్తున్నారు.
ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతుల పరిస్థితి?
కొత్త విధానంతో ఎరువుల విక్రయాల్లో పారదర్శకత పెరగడంతో పాటు రైతులకు నిర్ణీత ధరలకు ఎరువులు అందే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లు లేని రైతులు, కౌలు రైతులకు మాత్రం కొత్త యాప్తో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సమస్యలపై భవిష్యత్తులో మార్పులు చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.






