15 August, 2026 | 1:31 AM

దేశంలో కొందరి ఉగ్రకుట్రలు

15-08-2026 12:00 AM
  1. విదేశీ శక్తులు కాదు.. 
  2. భారత్‌లోనే ఉంటూ దేశ వ్యతిరేక చర్యలు 
  3. హర్ ఘర్ తిరంగా యాత్రలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు 
  4. కాంగ్రెస్ పార్టీలో జెన్ జీకి అవకాశం కల్పించాలి: కేంద్ర మంత్రి బండి సంజయ్ 
  5. భారత్‌ను ఏ శక్తీ విడదీయలేదు: ఎంపీ లక్ష్మణ్  
  6. దేశంతో.. దేశం కోసం యువత: బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు

హైదరాబాద్, ఆగస్టు 14(విజయక్రాంతి): దేశంలోనే ఉంటూ దేశానికి వ్యతిరేకంగా కొందరు ఉగ్రకుట్రలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశీ శక్తులు మాత్రమే కాదు, మన దేశంలోనే కొందరు దేశానికి వ్యతిరేకంగా ప్రస్తుతం కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. బీజేపీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్‌లోని అంబేద్కర్ విగ్రహం నుంచి స్వామి వివేకానంద విగ్రహం వరకు ‘హర్ ఘర్ తిరంగా’ యాత్ర జరిగింది.

ఈ ర్యాలీలో యువత, విద్యార్థులు, రాజకీయ, సినీప్రముఖులు పాల్గొని, జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ.. దేశభక్తిని చాటుకున్నారు. ర్యాలీలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ప్రధాని మోదీ హయాంలో దేశ ప్రగతిని చూసి ప్రతిపక్షాలు సహించలేకపోతున్నాయని విమర్శలు గుప్పించారు. దేశం అభివృద్ధి చెందకూడదని, భారతదేశ ప్రగతిని అడ్డుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.

కాకతీయ విశ్వవిద్యాలయంలో నక్సలైట్లు జాతీయ జెండాను దహనం చేసినప్పుడు, అది కేవలం జాతీయ జెండాకు జరిగిన అవమానం మాత్రమే కాదని, 140 కోట్ల మంది భారతీయులకు జరిగిన అవమానమని గుర్తు చేశారు. మరో కేంద్రమంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో, రాష్ట్ర క్యాబినెట్‌లో జెన్ జీలకు అవకాశం కల్పించి, తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే టిక్కెట్లలో జెన్ జీలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

జాతీయ జెండాలో కాషాయం అంటే ధైర్యానికి, త్యాగానికి ప్రతీక అని, తెలుపు రంగ శాంతికి చిహ్నమని పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు మాట్లాడుతూ.. భారతదేశాన్ని ఏ శక్తి విడదీయలేదని ఎంపీ లక్ష్మణ్ స్పష్టం చేశారు. దేశంతో, దేశం కోసం యువత నిలవాలని, అవసరమైతే త్యాగాలు చేయాలనే స్ఫూర్తితో ఉండాలని తెలిపారు. ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ.. దేశం పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, దేశ సమగ్రతను, భద్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు.

దేశాన్ని విభజించేందుకు విదేశీ శక్తులు, అలాగే దేశంలోనే కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్న సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. ఈ తరం ఆనాటి త్యాగాలను ఎన్నటికీ మర్చిపోకూడదని, వాటిని గుండెల్లో పెట్టుకోవాలని, దేశమంటే కేవలం అభిమానం మాత్రమే కాదు.. దేశమంటే బాధ్యత అని పేర్కొన్నారు. హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు జాతీయ జెండాను గౌరవించాలని, ఆ గౌరవం రావాలంటే ప్రతి ఒక్కరిలో దేశభక్తి, జాతీయతా భావాలు మరింత పెరగాలన్నారు.

యాత్రలో ఎంపీలు లక్ష్మణ్, ఈటల రాజేందర్, అర్వింద్‌కుమార్, గోడెం నగేష్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్సీలు మల్కకొమరయ్య, ఏవీఎన్‌రెడ్డి, మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మేకల శిల్పారెడ్డితోపాటు ఇతర ముఖ్యమైన నాయకులు పాల్గొన్నారు.