ఆస్తి కోసం దిగజారిన కొడుకు
తండ్రి మృతదేహం నుంచి వేలిముద్ర తీసుకున్న కుమారుడు
యూపీ రాజధాని లక్నోలో ఘటన
లక్నో, ఆగస్టు 14: ఆస్తి కోసం మానవత్వం మరిచాడు ఓ వ్యక్తి. తండ్రి చనిపోయాక అతని మృతదేహం నుంచి తెల్ల కాగితంపై వేలిముద్ర తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని లక్నో సమీపంలోని ఖరౌహా గ్రామంలో చోటు చేసుకోగా.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఖరౌహా గ్రామానికి చెందిన ఛత్రపాల్ (75)కు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
అందరికీ పెళ్లిళ్లు జరిగాయి. కుమారుడు మహేంద్ర, కోడలు లక్ష్మివేధింపులు భరించలేక ఛత్రపాల్ కొంతకాలంగా కుమార్తెల వద్ద ఉంటున్నాడు. తనను యోగక్షేమాలు చూసుకున్న కుమార్తెలకు ఛత్రపాల్ భూమి రాసిచ్చాడు. కుమారుడికి ఆస్తిలో చిల్లిగవ్వ కూడా ఇవ్వబోనంటూ తేల్చి చెప్పాడు. ఈ విషయమై పత్రికలో ప్రకటన కూడా ఇచ్చాడు. ఛత్రపాల్ ఆరోగ్యం విషమించడంతో జూలై 7న కూతురు సుమన్ తన అన్న మహేంద్రకు సమాచారం ఇచ్చారు.
దీంతో కుటుంబంతో కలిసి లక్నోకు వచ్చిన మహేంద్ర.. తండ్రికి చికిత్స చేయిస్తానని గ్రామానికి తీసుకెళ్లాడు. తీసుకెళ్లిన రెండు రోజులకే ఛత్రపాల్ మృతిచెందాడు. అంత్యక్రియల కోసం సుమన్, ఇతర కుటుంబ సభ్యులు గ్రామానికి చేరుకున్నారు. ఆస్తి కోసం మృతిచెందిన ఛత్రపాల్ చేతి వేలిని పట్టుకుని మహేంద్ర.. ఖాళీ కాగితాలపై వేలిముద్ర తీసుకున్నాడు. ఎవరో ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. బతికున్నప్పుడు తండ్రిని పట్టించుకోని మహేంద్ర.. మరణించిన తర్వాత కూడా ఆస్తికోసం మృతదేహాన్ని ఉపయోగించున్నాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.






