రేషన్‌కార్డులపై మోదీ ఫొటో ఏదీ?
రాష్ట్ర ప్రభుత్వ తీరుపై బీజేపీ ఎంపీల ఫైర్
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయకముందే అప్పుడే వాటిపై రాజకీయ వివాదం రాజుకుంది. తెలంగాణలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమైన నేపథ్యంలో ఆ కార్డుపై ప్రధాని మోదీ ఫొటో లేదెందుకని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, రఘునందన్‌రావు ప్రశ్నిస్తున్నారు. నేడు సంగారెడ్డి జిల్లా వేదికగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
ఇదే సమయంలో రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల్లోనూ మంత్రులు, ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా కార్డుల పంపిణీ జరగనుంది. అయితే పంపిణీ చేయబోతున్న స్మార్ట్ రేషన్‌కార్డు మోడల్‌ను బీజేపీ తప్పుబట్టింది. ఆ కార్డుకు ఎడమవైపు సీఎం రేవంత్‌రెడ్డి, కుడివైపు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫొటోలను ముద్రించారు. కానీ దానిపై ప్రధాని మోదీ ఫొటో ఎందుకు పెట్టలేదని బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు అందించే రేషన్ బియ్యం పంపిణీలో కేంద్రానిదే సింహభాగమని, అలాంటప్పుడు ఎవరి అయ్య జాగీరని రేవంత్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఫొటోలు మాత్రమే వేసుకుంటున్నారు? అంటూ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు.
చిన్న సీఎం ...సన్న బియ్యం... స్మార్ట్‌కార్డు ప్రోగ్రామ్ పెడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేశారు. పేదలకు ఉచిత రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే అందిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం తమ ప్రచారం కోసం సీఎం, మంత్రి ఫొటోలు వేసుకోవడం హాస్యాస్పదమని ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు.






