టెస్సెరాక్ట్‌కు భూములు ఎలా ఇచ్చారు?
అది జీరో ఉద్యోగుల సంస్థ
తక్షణమే రద్దు చేయాలి
రేవంత్ పాత్రపై విచారణ చేయండి
లోకాయుక్తను ఆశ్రయించిన బీఆర్‌ఎస్
హైదరాబాద్, ఆగస్టు 14 (విజయక్రాంతి): రంగారెడ్డి జిల్లా రావిర్యాలలో 5 ఎకరాల ప్రజా భూమిని టెస్సెరాక్ట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపించారు. కేటాయించిన భూములను వెంటనే రద్దు చేయాలని, రేవంత్ పాత్రపై సమగ్ర విచారణ చేయాలని కోరారు. టెస్సెరాక్ట్ భూ కేటాయింపులను వ్యతిరేకిస్తూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, డాక్టర్ సంజయ్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి తదితరులు శుక్రవారం లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్‌రెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు.
రూ.200 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.7 కోట్లకే ధారాదత్తం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కంపెనీ నివేదికలో ఉద్యోగుల సంఖ్య ‘జీరో’గా ఉందని, నివాస ఫ్లాట్ చిరునామాతో కొనసాగుతున్న సంస్థకు వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు కేటాయించడంలో అంతర్యం ఏమిటని ప్రశ్నించారు.
టెస్సెరాక్ట్ సంస్థలో సీఎం సోదరుడు కొండల్‌రెడ్డి చైర్మన్‌గా, సీఎం మేనల్లుడు నయన్‌రెడ్డి సీఈవోగా ఉన్నారని ఆరోపించారు. భూ కేటాయింపులకు 5 నెలల ముందే నయన్‌రెడ్డి సంస్థ సీఈవోగా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు. రికార్డుల్లో కొండల్‌రెడ్డి పేరు లేకుండా బినామీలను తెరపైకి తీసుకొచ్చారని, ఇది బినామీ వ్యవహారమని ఆరోపించారు. అసెంబ్లీలో మంత్రి శ్రీధర్‌బాబు చేసిన ప్రకటనలకు భిన్నంగా కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ భూకేటాయింపుల విషయాన్ని స్వయంగా అంగీకరించారని బీఆర్‌ఎస్ నేతలు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో సీఎం రేవంత్‌రెడ్డి పాత్రపైన, మంత్రి శ్రీధర్‌బాబు, టీజీఐఐసీ అధికారులపై అవినీతి నిరోధక చట్టం, బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద విచారణ చేపట్టాలని డిమాండ్ చేసింది.






