ప్రజావాణి దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత
అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి
ములుగు, ఆగస్టు 17 (విజయక్రాంతి): ప్రజావాణి కార్యక్రమంలో అర్జిదారులు సమర్పించిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ, సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సిహెచ్ మహేందర్ జి ఫిర్యాదుదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.
ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 28 దరఖాస్తులు అందగా, వాటిలో భూ సమస్యలకు సంబంధించి 03, ఇందిరమ్మ ఇండ్లకు 05, పెన్షన్లకు 07, ఇతర శాఖలకు సంబంధించినవి 13 దరఖాస్తులు ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత శాఖల అధికారులకు పంపించడం జరిగిందని తెలిపారు.
ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తుకు అధికారులు ప్రాధాన్యతనిస్తూ, నిర్ణీత గడువులోపు సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, డిప్యూటీ ట్రైనింగ్ కలెక్టర్, జిల్లా అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.






