30 June, 2026 | 2:10 AM

పెద్దబొంకూరులో హైలెవెల్ వంతెన ప్రారంభం

30-06-2026 12:00 AM
  1. రూ.40లక్షలతో పెద్దకల్వల శివాలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన
  2. అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదన్న ప్రభుత్వ విప్, 
  3. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు

పెద్దపల్లి, జూన్ 29 (విజయక్రాంతి) : పెద్దపల్లి నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా పెద్దపల్లి మండలం పెద్దబొంకూరు గ్రామంలో రూ.2.40 కోట్ల వ్యయంతో నిర్మించిన హై లెవెల్ వంతెనను, రూ.12 కోట్లతో నిర్మించిన నిట్టూరుకాచాపూర్ నూతన బీటీ రోడ్డును ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సోమవారం ప్రారంభించారు. అనంతరం పెద్దకల్వల గ్రామంలోని శివాలయంలో సీఎంజీఎఫ్ నిధుల ద్వారా రూ.40 లక్షల వ్యయంతో నిర్మించనున్న రాజగోపురం, అర్చకుల వసతి గృహాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ, పెద్దపల్లి నియోజకవర్గం కోట్ల రూపాయల అభివృద్ధి పనులతో వేగంగా ముందుకు సాగుతోందన్నారు.

పెద్దబొంకూరు హై లెవెల్ వంతెన వల్ల వర్షాకాలంలో గ్రామ ప్రజలకు, ప్రయాణికులకు రాకపోకలు సులభతరం అవుతాయని తెలిపారు. నిట్టూరుకాచాపూర్ బీటీ రోడ్డు ద్వారా గ్రామాలు, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల మధ్య రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని చెప్పారు. నియోజకవర్గంలో నూతన బస్ డిపో, బైపాస్ రోడ్డు, ప్రభుత్వ ఆసుపత్రి ఆధునీకరణ, పోలీస్ స్టేషన్లు, మున్సిపాలిటీల అభివృద్ధి, అమృత్ పథకం పనులు, హై లెవెల్ వంతెనలు, డబుల్ లైన్ రోడ్లు, సెంట్రల్ లైటింగ్ వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు రుణమాఫీ, రైతు భరోసా, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీలేని రుణాలు, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో నిట్టూరువెంకటరావుపల్లి మధ్య కొత్త వంతెన నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ అధికారులు, పలు గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.