30 June, 2026 | 2:05 AM

మన ర్యాంకర్లు జంప్!

30-06-2026 01:16 AM

ఎప్‌సెట్‌లో టాప్ ర్యాంకులొచ్చినా ఐఐటీ, ఎన్‌ఐటీపైనే ఆసక్తి

ఆకర్షిస్తున్న అక్కడి భారీ ప్యాకేజీలు

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): మన టాలెంట్ తరలిపోతున్నది.. టాపర్లంతా రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో చదివేందుకు ఆసక్తి చూపించడంలేదు. మరీముఖ్యంగా ఇంజినీరింగ్ అభ్యర్థులు. టీజీ ఎప్‌సెట్‌లో మంచి ర్యాంకులు పొందిన అభ్యర్థుల భవిష్యత్ ఆలోచనలు వేరుగా ఉన్నాయి. హైదరాబాద్‌లోని పేరున్న పలు కాలేజీల్లోనూ అడ్మిషన్లు పొందేందుకు వారు సుముఖత చూపించడంలేదు. వారంతా ఎన్‌ఐటీ, ఐఐటీతోపాటు పక్క రాష్ట్రాల్లోని ఇతర విద్యాసంస్థలపైనే మనసు పెడుతున్నారు.

కోర్సు పూర్తయిన తర్వాత అక్కడ భారీ ప్యాకేజీలతో ప్లేస్‌మెంట్స్ వస్తుండటంతోనే దీనికి కారణం. టాప్ ర్యాంకర్లు పేరుకే ఎప్‌సెట్ పరీక్ష రాస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక్కడ రాసే ప్రవేశ పరీక్ష కేవలం ఒక ఆప్షన్‌గా, ప్రాక్టీస్‌గా పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనికంటే ప్రాముఖ్యతను ఐఐటీ, ఎన్‌ఐటీకే ఇస్తున్నారు. ఆయా విద్యాసంస్థల్లో కోర్సు చేస్తే మధ్యలోనే ప్లేస్‌మెంట్స్ వస్తాయనే భావన ర్యాంకర్లలో ఉంది.

వాటిలో చదివిన టాలెంట్ ఉన్న విద్యార్థులకు బడా జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు మంచి ప్యాకేజీలను ఇచ్చి  తన్నుకుపోతున్నారు. హైదరాబాద్ మహానగరంలోనూ మంచి పేరున్న ఇంజినీరింగ్ కాలేజీలూ ఉన్నాయి. అయితే వీటిలో అడ్మిషన్ పొందకుండా ఎన్‌ఐటీలు, ఐఐటీల్లోనే వారు చేరుతున్నారు. మరి కొందరు తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల్లోని ప్రైవేట్ యూనివర్సిటీలకు వెళ్తున్నారు. టాప్ ర్యాంకులు సాధిస్తున్న వారిలో తెలంగాణలోని ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీ వరంగల్‌లోనూ చేరుతున్నారు.

జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత సాధించిన వాళ్లు నేరుగా ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీకి వెళ్లిపోతున్నారు. ఫీజులు, ఇతరత్రా ఖర్చులు ఎంతున్నా.. అక్కడికే వెళ్లిపోతున్నారు. ఉదహరణకు ఐఐటీలో నాలుగేళ్లకు ఫీజు దాదాపు రూ.8 లక్షలు అవుతుంది. సగటు ప్యాకేజీ రూ.21(ఎల్‌పీఏ) లక్షలు. అంటే 5 నెలల జీతంతో ఫీజు వసూలు అవుతుంది. అదే ఎన్‌ఐటీలో అయితే రూ.17.50 లక్షల వరకు ప్యాకేజీ వస్తుంది.

అదే మనదగ్గర ఉండే జేఎన్టీయూలో ఫీజు రూ.2 లక్షలైనా రూ.6 లక్షల ఉద్యోగం వస్తే మూడు నుంచి నాలుగు నెలల్లో ఫీజుకు ఖర్చుచేసిన మొత్తం వస్తుంది. కానీ బ్రాండ్,  కెరీర్ గ్రోత్, విదేశీ ఎంఎస్ అవకాశాలు ఐఐటీ, ఎన్‌ఐటీలోనే 10 రెట్లు ఎక్కువగా ఉంటాయని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

టాప్-50లో ఒక్క కాలేజీ లేదు

రాష్ట్రంలోని 10 నుంచి 20 వరకు మాత్రమే టాప్ ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మిగతా కాలేజీల్లో పెద్దగా విద్యాప్రమాణాలు పాటించడంలేదు. ఫ్యాకల్టీ, మౌలిక వసతులు, రీసెర్చ్, ల్యాబ్‌లు, ప్లేస్‌మెంట్స్ సరిగా ఉండడంలేదు. పైగా ఐఐటీ హైదరాబాద్, ఎన్‌ఐటీ వరంగల్ తర్వాత దేశంలోని టాప్-50 కాలేజీల్లో పెద్దగా ఏ కాలేజీలు లేవు. జేఈఈలో 5 వేల ర్యాంకు వస్తే ఎన్‌ఐటీలో  సీఎస్‌ఈ సీటు వస్తుంది. అదే ఎప్‌సెట్‌లో 10వ ర్యాంకు వచ్చినా ఐఐటీ రాదు.

దీంతోనే విద్యార్థులు జేఈఈపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ఈసారి ఎప్‌సెట్ పరీక్షను దాదాపు 3.4 లక్షల మంది రాయగా, వీరిలో టాప్ వెయ్యి ర్యాంకర్లలో 90 శాతం మంది జేఈఈ కూడా రాసినట్లు తెలుస్తోంది. జేఎన్టీయూ, ఓయూలను ర్యాకింగ్‌లో టాప్-50లోపు తీసుకెళ్లకపోతే ఎప్‌సెట్ నిర్వహించేది మనం..టాపర్లను తీసుకెళ్లేది ఐఐటీలు, ఎన్‌ఐటీలు అవుతున్నాయి.

కౌన్సిలింగ్‌లో పాల్గొన్నది 47 మందే

ఎప్‌సెట్ కౌన్సిలింగ్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకున్న ర్యాంకులు, అభ్యర్థుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. 1-500లోపు ర్యాంకుల్లో కౌన్సి లింగ్‌కు  కేవలం 47 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. 1-100 ర్యాంకుల్లోపు కేవలం ఐదుగురు మా త్రమే రిజిస్ట్రేషన్ చేసుకోగా, 101- 500లోపు ర్యాంకర్లలో కేవలం 42 మంది మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

అంటే టాప్ ఒకటో ర్యాంకు నుంచి 500లోపు ర్యాంకుల వరకు కౌన్సిలింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపిన వారు 42 మంది మాత్రమే. ఇది చాలా తక్కువ సంఖ్య. ఇక ఆపైన ర్యాంకులు సాధించిన వారు మాత్ర మే ఎక్కువ మంది కౌన్సిలింగ్‌లో పా ల్గొనేందుకు దరఖాస్తు చేసుకుంటున్నారు.