మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల తరలింపుపై కలెక్టర్ పర్యవేక్షణ
మంథని, ఆగస్టు 12(విజయక్రాంతి): మంథని మండలంలోని మల్లెపల్లి శివారులో ప్రస్తుతం కొనసాగుతున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలను( Government Degree College) మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణానికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష బుధవారం మంథని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
డిగ్రీ కళాశాల తరలింపునకు సంబంధించిన వసతులు, తరగతి గదులు, ఇతర సౌకర్యాలను కలెక్టర్ పరిశీలించారు. కళాశాలను వారంలోపు తరలించేలా చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని, తరగతుల నిర్వహణకు అనువైన వాతావరణం ఉండేలా చూడాలని అధికారులకు సూచించారు. కలెక్టర్ పర్యటనతో డిగ్రీ కళాశాల తరలింపు ప్రక్రియకు వేగం పెరిగింది. కలెక్టర్ వెంట మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ సహేందర్ రెడ్డి, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.






