శ్రీశైలానికి పోటెత్తిన వరద
ఒక్కరోజులో 14.20 టీఎంసీల నీరు చేరిక..
876.20 అడుగులకు నీటిమట్టం
అచ్చంపేట,(విజయక్రాంతి): శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో జలాశయం నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శనివారం ఉదయం 6 గంటల నమోదైన వివరాల ప్రకారం జలాశయం నీటిమట్టం 876.20 అడుగులకు చేరింది. నిల్వ 169.4655 టీఎంసీలకు పెరిగింది. శుక్రవారం ఇదే సమయానికి నీటిమట్టం 873.20 అడుగులు, నిల్వ 155.2652 టీఎంసీలు ఉండగా.. ఒక్కరోజులోనే 3 అడుగుల నీటిమట్టం, 14.20 టీఎంసీల నిల్వ పెరిగింది.
2.11 లక్షల క్యూసెక్కుల వరద
జలాశయానికి 2,11,632 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. వర్షపాతం మాత్రం శూన్యంగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్) 885 అడుగులు కాగా, ప్రస్తుతం మరో 8.80 అడుగుల మేర మాత్రమే నీటిమట్టం పెరగాల్సి ఉంది. పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలు.
విద్యుదుత్పత్తి జోరుగా..
భారీగా నీటి లభ్యత ఉండటంతో శ్రీశైలం ఎడమ, కుడి గట్టు జలవిద్యుత్ కేంద్రాల్లో విద్యుదుత్పత్తి కొనసాగుతోంది. ఏపీ పవర్‌హౌస్‌లో 9.691 మిలియన్ యూనిట్లు, తెలంగాణ పవర్‌హౌస్‌లో 17.027 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నమోదైంది. రెండు పవర్‌హౌస్‌ల ద్వారా కలిపి 26.718 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు.
47,278 క్యూసెక్కుల దిగువకు విడుదల
జలాశయం నుంచి వివిధ అవసరాల కోసం సగటున 47,278 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో ఏపీ పవర్‌హౌస్ ద్వారా 17,137 క్యూసెక్కులు, తెలంగాణ పవర్‌హౌస్ ద్వారా 20,004 క్యూసెక్కులు, హెచ్‌ఎన్‌ఎస్ఎస్ లిఫ్ట్ ద్వారా 875 క్యూసెక్కులు, ఎంజీకేఎల్‌ఐ ద్వారా 1,133 క్యూసెక్కులు, పీఆర్‌పీ ద్వారా 8,000 క్యూసెక్కులు విడుదలవుతున్నాయి. ఆవిరి నష్టాలు 129 క్యూసెక్కులుగా నమోదయ్యాయి. స్పిల్‌వే, ముచ్చుమర్రి, మల్యాల కేఎల్‌సీ ద్వారా నీటి విడుదల లేదు.
46 టీఎంసీలకు పైగా ఖాళీ
శ్రీశైలం జలాశయం పూర్తి సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 169.4655 టీఎంసీల నీటి నిల్వ ఉంది. దీంతో జలాశయంలో ఇంకా సుమారు 46.34 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే అవకాశం ఉంది. వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే జలాశయం త్వరలోనే పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకునే అవకాశం ఉంది. దీంతో అతి త్వరలోనే గేట్లను ఎత్తే అవకాశం ఉంది.






