8 August, 2026 | 6:53 PM

అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులా?

08-08-2026 03:59 PM

బైండోవర్లతో ప్రశ్నించే గొంతుకలను అణచలేరు

చందుపట్లలో వివిధ సంఘాలు, పార్టీ నాయకుల ఆగ్రహం

చివ్వెంల,(విజయక్రాంతి): మండలంలోని బండమీది చందుపట్ల గ్రామంలో జరుగుతున్న అక్రమాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు, బైండోవర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వివిధ సంఘాలు, పార్టీ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతుకలను అక్రమ కేసులతో అణచివేయలేరని వారు స్పష్టం చేశారు.

గ్రామంలోని ఊర చెరువులో ఉన్న నీటిని విక్రయించేందుకు జేసీబీతో చెరువు మధ్యలో నుంచి కాలువ తీయించడంపై ప్రశ్నించినందుకు టీఆర్‌పీ నాయకుడు వీరబోయిన శ్రీనివాస్ యాదవ్‌పై బైండోవర్ కేసులు పెట్టించారని వారు ఆరోపించారు. ఇప్పటికే వర్షాలు లేక చెరువు ఎండిపోయే పరిస్థితి నెలకొన్న సమయంలో చెరువు నీటిని తరలించేందుకు ఇలాంటి చర్యలు చేపట్టడం సరికాదని ప్రశ్నించినందుకే కేసులు పెట్టడం ఏమిటని వారు ప్రశ్నించారు.

శనివారం విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ నాయకులు, యువజన సంఘాల నాయకులు, గ్రామస్తులు శ్రీనివాస్ యాదవ్‌ను పరామర్శించారు. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని, ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు. చెరువు నీటిని ఎవరైనా అక్రమంగా విక్రయిస్తున్నట్లు తేలితే సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకునేలా కలిసికట్టుగా పోరాడాలని వారు నిర్ణయించారు. రాబోయే రోజుల్లో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని నాయకులు తెలిపారు.