25 March, 2026 | 11:01 PM

రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిల చెల్లింపులో హైకోర్టు తీర్పు హర్షణీయం

25-03-2026 08:56 PM

* ఏక మొత్తం లో రిటైర్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

హనుమకొండ,(విజయక్రాంతి): రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లింపుల విషయం లో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ ఏప్రిల్ 9 లోగా చెల్లిస్తామని కోర్టుకు విన్నవించడం పట్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధన కమిటీ రాష్ట్ర కో కన్వినర్ శ్రీదర్ల ధర్మేంద్ర హర్షం వ్యక్తం చేశారు. ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ లోనీ పిఆర్టియు భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ... మార్చి 2024 నుండి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ విడుదల చేయాలి.

ప్రభుత్వం చుట్టూ అధికారుల చుట్టూ తిరిగిన పట్టించుకోక పోవడం వలన కొంత మంది ఉద్యోగులు కోర్టును ఆశ్రయించగా హైకోర్టు 9 వారాల్లోగా చెల్లించాలని తీర్పు ఇవ్వగా, ఈ నేపథ్యంలో హైకోర్టు జడ్జి ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి సందీప్ సుల్తానియ ని స్వయంగా కోర్టుకు హాజరు కావాలని కోరడం తో ఏప్రిల్ 9 లోగా చెల్లిస్తామని కోర్టుకు విన్నవించడం జరిగిందన్నారు. హై కోర్టు వెలువరించిన తాజా తీర్పు ప్రకారం వేలాది మంది విశ్రాంత ఉద్యోగుల పాలిట ఒక ఆశల ఆయుధం అన్నారు.

ఏప్రిల్ 9 తేదీని తుది గడువుగా విధిస్తూ ఆలోగా పెండింగ్ లో ఉన్న అన్ని రిటైర్మెంట్ బెన్ఫిట్స్ చెల్లించాలని స్పష్టం చేయడం ద్వార న్యాయ వ్యవస్థ తన నైతిక బాధ్యతను చాటుకుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు వెంటనే బకాయిలు చెల్లించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.ఈ సమావేశం లో కందకూరి దేవదాసు, అబ్దుల్ గఫర్, మేకిరీ దామోదర్, ఇంద్రసేనారెడ్డి,సూర కుమారస్వామి,సారయ్య, విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు.