25 March, 2026 | 11:29 PM

శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అంకిత్

25-03-2026 09:54 PM

భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం మిథిలా స్టేడియం వద్ద జరుగుతున్న శ్రీరామనవమి మహోత్సవ ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ అంకిత్ బుధవారం సాయంత్రం పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాట్ల పురోగతిపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకుని, త్వరితగతిన పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ పరిశీలనలో కలెక్టర్ వెంట భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ట, శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ, దేవస్థానం ఈవో దామోదర్ రావు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దేవస్థానం అర్చకులతో మాట్లాడిన కలెక్టర్, ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా నిర్వహించనున్న భూమి పూజ కార్యక్రమం, శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం (కళ్యాణ కత్రువు) నిర్వహణకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్టేడియం పరిధిలో ఏర్పాటు చేసిన వివిధ సెక్టార్లలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ముఖ్యంగా వివిఐపి సెక్టార్లలో బారికేటింగ్, భద్రతా ఏర్పాట్లు, సౌకర్యాల కల్పనపై ప్రత్యేకంగా పరిశీలించి, అవసరమైన మెరుగులు చేర్చాలని అధికారులకు సూచించారు. శ్రీరామనవమి ఉత్సవాలను భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.