25 March, 2026 | 11:24 PM

సకాలంలో న్యాయం జరిగేలా విచారణ వేగం పెరగాలి

25-03-2026 09:50 PM

రౌడీ షీటర్లపై నిఘా పెరగాలి

జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా కేసుల విచారణ వేగంగా పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ అన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో వారు మాట్లాడారు. జిల్లాలో నమోదైన నేరాలు, పెండింగ్ కేసులు, కోర్టు మానిటరింగ్, డయల్-100 కాల్స్ స్పందన, సీసీ కెమెరాల ఏర్పాటు, ప్రజా ఫిర్యాదుల పరిష్కారం, సైబర్ క్రైమ్ కేసుల్లో బాధితులకు నగదు రిఫండ్, దొంగతనం కేసుల డిటెక్షన్, మర్డర్ అనుమానాస్పద మృతి కేసుల దర్యాప్తు తదితర అంశాలపై సమీక్షించారు.

ఎఫ్‌ఐఆర్ నుంచి చార్జిషీట్ వరకు ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలని, బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా కేసుల విచారణ వేగంగా పూర్తి చేయాలని ఎస్పీ సూచించారు. సైబర్ మోసాలు, మహిళా భద్రతపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అరైవ్-అ లైవ్ కార్యక్రమం ద్వారా రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించాలన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్లపై నిఘా ఉంచి నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, పెండింగ్ కేసులు లేకుండా దర్యాప్తు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఎస్పీలు సాయి వెంకట్ రెడ్డి, బుర్రి శ్రీనివాస్, శ్రీనివాసులు, సీఐలు, ఎస్ఐలు మరియు స్టేషన్ రైటర్లు పాల్గొన్నారు.