కన్నుల పండుగగా కొనసాగిన తిరంగా ర్యాలీ
కామారెడ్డి వీధుల్లో భారీ ర్యాలీ
కామారెడ్డి,(విజయక్రాంతి): వందేమాతరం గీతం 150 సంవత్సరాలు పూర్తి చేసుకోనున్న శుభ సందర్భంలో, 80వ స్వాతంత్య్ర దినోత్సవం వేళ... ప్రజల్లో దేశ భక్తిని, జాతీయ ఐక్యతను పెంపొందించేందుకు గురువారం కామారెడ్డిలో బిజెపి ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశభక్తి స్ఫూర్తితో కామారెడ్డి జిల్లా కేంద్రంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి నాయకత్వంలో గాంధీ గంజ్ నుండి ప్రారంభమై పట్టణ వీధుల గుండా జె పి ఎల్ రోడ్, సుభాష్ రోడ్డు, తిలక్ రోడ్డు, సిరిసిల్ల రోడ్డు, స్టేషన్ రోడ్డు, కమాన్ మీదుగా నిజాంసాగర్ చౌరస్తా వరకు తిరంగా ర్యాలీ భారీ ర్యాలీ నిర్వహించారు. త్రివర్ణ పతాక రెపరెపల మధ్య దేశభక్తి చాటే ఈ మహా ర్యాలీ నిజాంసాగర్ చౌరస్తా లో జాతీయ గీతం జనగణమన ఆలాపన తో ముగించారు. ఈ ర్యాలీలో పట్టణంలోని వ్యాపారస్తులు, యువకులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.






