విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలి
జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్
కాళేశ్వరం,(విజయక్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు కల్పించాలని జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్ అన్నారు. మేడిపల్లి, మహదేవ్‌పూర్, కాళేశ్వరం ఆశ్రమ ఉన్నత పాఠశాలలను జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి నాగసాగర్ గురువారం సందర్శించి విద్యార్థుల విద్యా ప్రమాణాలు, భోజనం, వసతులు, పాఠశాలల నిర్వహణను పరిశీలించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన భోజనం, వసతులు అందేలా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి విద్యాభ్యాసం, భోజనం, వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహదేవ్‌పూర్ ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజన నాణ్యత, ఉమ్మడి మెనూపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు.
మూడు పాఠశాలల్లో ఉమ్మడి మెనూ సక్రమంగా అమలవుతోందని, ఉపాధ్యాయుల బోధన ప్రణాళికలు సంతృప్తికరంగా ఉన్నాయని నాగసాగర్ తెలిపారు. విద్యార్థులు సంతోషంగా ఉన్నారని, పాఠశాలల్లో సానుకూల వాతావరణం ఉందని పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.






