13 August, 2026 | 7:08 PM

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు..!

13-08-2026 05:58 PM

కొత్త యాప్ వద్దు.. పాత విధానమే ముద్దు

యూరియా కోసం మెదక్ రహదారిపై రైతుల రాస్తారోకో

గంటపాటు స్తంభించిన రాకపోకలు

రామాయంపేట,(విజయక్రాంతి): పంట చేతికొచ్చే వేళ రైతన్నకు ఎరువు దొరకని దుస్థితి నెలకొంది. యూరియా కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సి వస్తుండటంతో అన్నదాతల ఆగ్రహం. యూరియా పంపిణీకి తీసుకొచ్చిన నూతన యాప్ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రైతులు రోడ్డెక్కారు. రామాయంపేటలో మెదక్ ప్రధాన రహదారిపై బైఠాయించి సుమారు గంటపాటు రాస్తారోకో నిర్వహించి ప్రభుత్వంపై తమ నిరసనను వ్యక్తం చేశారు.

యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా కొత్త యాప్ విధానాన్ని అమలు చేయడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంకేతిక సమస్యలు, నమోదు ప్రక్రియల పేరుతో రైతులను రోజుల తరబడి తిప్పుకోవడం ఏమిటని ప్రశ్నించారు. యాప్‌లు, నిబంధనలు రైతుల కడుపు నింపవని.. పంటకు అవసరమైన సమయంలో యూరియా అందించడమే ప్రభుత్వ బాధ్యత అని రైతులు స్పష్టం చేశారు.

పాత విధానంలోనే రైతులకు సరిపడా యూరియాను అందుబాటులో ఉంచాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరానికి తగ్గట్టుగా ఎరువులను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కోసం రైతులు తెల్లవారుజామునే కేంద్రాల వద్ద బారులు తీరాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. రైతుల రాస్తారోకోతో మెదక్ రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమించాలని సముదాయించారు. పోలీసుల జోక్యంతో రైతులు రాస్తారోకోను విరమించడంతో పరిస్థితి సద్దుమణిగింది. పంట పండించేందుకు రైతన్న రాత్రింబవళ్లు శ్రమిస్తుంటే.. పంటకు ప్రాణమైన యూరియా కోసం మాత్రం రోడ్డెక్కాల్సిన పరిస్థితి రావడంపై అన్నదాతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.