13 August, 2026 | 7:07 PM

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని తహసీల్దార్‌కు వినతిపత్రం

13-08-2026 06:01 PM

చిట్యాల,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, పీఆర్‌సీని ప్రకటించడంతో పాటు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ యూఎస్‌పీసీ నాలుగు దశల పోరాట కార్యక్రమంలో భాగంగా టీఎస్‌యూటీఎఫ్ చిట్యాల మండల శాఖ ఆధ్వర్యంలో గురువారం తహసీల్దార్‌కు 29 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా టీఎస్‌యూటీఎఫ్ మండల అధ్యక్షుడు ఏషమళ్ల నాగయ్య మాట్లాడుతూ... ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను రెండేళ్లు గడిచినా పరిష్కరించకపోవడం శోచనీయమన్నారు.

ప్రభుత్వం తక్షణమే స్పందించి పీఆర్‌సీని ప్రకటించాలని, పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఇదే విధంగా నిర్లక్ష్యం కొనసాగిస్తే ఉపాధ్యాయుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతాయని, అవసరమైతే మరింత తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. టీఎస్‌యూటీఎఫ్ కోశాధికారి తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ముఖ్యంగా సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరించాలని, పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి సతీష్ గడగోజు, జిల్లా కార్యదర్శి, రాష్ట్ర కమిటీ సభ్యులు బడుగు అరుణ, మాజీ రాష్ట్ర కమిటీ సభ్యులు నర్ర సరళ, ఉపాధ్యక్షులు ఎం. జానకి రామలింగయ్య, చంద్రశేఖర్, సాధిక్ రామ్మోహన్, మాజీ అధ్యక్షులు యాదయ్య తదితరులు పాల్గొన్నారు.