13 August, 2026 | 7:15 PM

ఇళ్లు కూల్చివేతపై రాజాపూర్‌లో భగ్గుమన్న ఆగ్రహం

13-08-2026 05:48 PM

బ్లాస్టింగ్ పనులను అడ్డుకున్న గ్రామస్తులు

నష్టపరిహారం చెల్లించాకే చర్యలు చేపట్టాలని డిమాండ్

2014లో పంచాయతీ రికార్డులు తీసుకెళ్లి

ఇప్పుడు అనుమతుల పేరుతో ఇళ్ల కూల్చివేతలా?

ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ శ్రీనివాస్

గ్రామస్తులతో చర్చలు

రామగిరి,(విజయక్రాంతి): సింగరేణి బ్లాస్టింగ్ పనులు, ఇళ్ల కూల్చివేత చర్యలపై రాజాపూర్ గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రామగిరి మండలంలోని ఆర్జీ-3 పరిధిలో బ్లాస్టింగ్ పనులకు సింగరేణి అధికారులు సిద్ధమవడంతో గ్రామస్తులు ఒక్కసారిగా అడ్డుకున్నారు. యంత్రాలతో గ్రామంలోకి వచ్చిన అధికారులు ఇళ్లను కూల్చివేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

2014లో గ్రామ పంచాయతీ రికార్డులు అధికారులు తీసుకెళ్లారని, అప్పటి నుంచి తమ ఇళ్లకు సంబంధించిన రికార్డులు, అనుమతుల విషయంలో స్పష్టత లేకుండా పోయిందని గ్రామస్తులు వాపోయారు. ఇప్పుడు అనుమతులు లేవనే కారణంతో ఇళ్లను కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

తమ ఇళ్లను కూల్చివేస్తే కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా ఇళ్లకు జరిగిన నష్టాన్ని అంచనా వేసి, అర్హులైన బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని, ఆ తర్వాతే ఎలాంటి చర్యలైనా చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. నష్టపరిహారం చెల్లించకుండా, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఇళ్ల జోలికి వస్తే ఊరుకునేది లేదని గ్రామస్తులు స్పష్టం చేశారు. దీంతో బ్లాస్టింగ్ పనులను అడ్డుకుని అక్కడే ఆందోళనకు దిగారు.

విషయం తెలుసుకున్న ఎస్ఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడుతున్నారు. పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామస్తుల అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుంటున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఇళ్ల కూల్చివేతకు ముందు తమకు న్యాయం చేయాలని, నష్టపరిహారం చెల్లించే వరకు ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టవద్దని రాజాపూర్ గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.