16 March, 2026 | 3:14 AM

ఉత్త(మ్)మ కల.. నెరవేరుతున్న వేళ

16-03-2026 12:12 AM

పట్టణ పేదలకు ఇండ్ల పట్టాలు

సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదగా లబ్ధిదారులకు అందజేత

15 ఏండ్ల సమస్యకు పరిష్కారం చూపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 

ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచిన అభివృద్ధి మాంత్రికుడు 

సంతోషంలో తడిసి ముద్దవుతున్న పట్టణ పేదలు 

హుజూర్ నగర్, మార్చి 15: హుజూర్ నగర్ పట్టణంలో గత కొన్ని ఏండ్ల క్రితం కొందరు రైస్ మిల్లు కూలీలు, వివిధ వర్గాలకు చెందిన పేద కూలీలు గుడిసెలు వేసుకొని జీవనం సాగించేవారు. వారికి కనీస సౌకర్యాలు కూడా లేకుండ జీవిస్తుంటే వారిని చూసి చలించిన ఆనాటి ఎమ్మెల్యే, నేటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇండ్ల పట్టాలివ్వాలని వారి కష్టాలు తీర్చేందుకు ముందుకు వచ్చారు.

ఆనాటి ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ రెడ్డి, పట్టణంలోని పణిగిరి రామస్వామి గుట్ట వద్ద 112 ఎకరాల దేవాలయ శాఖ నుండి కోర్టు అనుమతితో అప్పటి మార్కెట్ రేటుకు కొనుగోలు చేసి, కొంతమేర ఖాళీ స్థలములను పేద ప్రజలకు ఉచితంగా అందించి, రోడ్లు, మురుగు కాల్వలు తదితర మౌలిక వసతులు కల్పించారు.

పక్కా ఇండ్ల కోసం దరఖాస్తులు స్వీకరించి పట్టాలు అందించారు. ఇప్పటికి 1000 కుటుంబాలకు ఇండ్ల పట్టాలు సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా అందజేయనుండగా మరో 1160 మందికి త్వరలో రానున్నాయి. వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి, ప్రజా ప్రభుత్వానికి కృతజ్ఞతలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్నేండ్లు తమకు ఇండ్లు దక్కుతయో లేదోనని ఆందోళన చెందామని, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఇచ్చిన పట్టాతో 15 లక్షల రూపాయల ఇల్లు తమ సొంతమైందని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

హుజూర్ నగర్ పట్టణంలో గజం జాగా లేని నిరుపేదలు సుమారు 20 ఏండ్ల క్రితం నాటి నుంచి తమకు ఇండ్లు, ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని ప్రజాప్రతినిధులను, అధికారులకు ఎన్నిసార్లు మొర పెట్టుకున్నా కనికరించలేదు.             

ఉత్తమ్ చొరవతోనే : స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మొట్ట మొదటిసారి 2009 శాసనసభ నియోజకవర్గంగా ఏర్పడి ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం పేదలకు సేవ చేయాలని దృడ సంకల్పంతో గుడిసెల ప్రాంతానికి వెళ్లగా.. తమకు ఇళ్ల పట్టాలు ఇప్పించాలని నిరుపేదలు తమ గోడును వెల్లబోసుకున్నారు. స్పందించిన ఆనాటి ఎమ్మెల్యే నేటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయం చేస్తానని, కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా ఇండ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన మంత్రి ఉత్తమ్...రాజకీయ సమీకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గత పాలకుల నిర్లక్ష్యంతో మోడల్ కాలనీ కాస్త మరుగునపడి డంపింగ్ యార్డ్ గా మార్చారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెను వెంటనే స్థానిక ఎమ్మెల్యే, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా ఉండడంతో సీఎం రేవంత్ రెడ్డిని ఒప్పించి అత్యధిక నిధులు మంజూరు చేయించి తిరిగి మోడల్ కాలనీ పునర్జీవం పోసుకుందని ప్రజల వినికిడి. మంత్రి ఉత్తమ్ ఇచ్చిన హామీ ప్రకారం నిరుపేద కుటుంబాలకు సర్వ హక్కులతో కూడిన ఇళ్ల పట్టాలను సీఎం రేవంత్ రెడ్డి చేతులు మీదుగా పంపిణీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. త్వరలోనే మరో 1000 మందికి అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.తమ 20 ఏండ్ల కల నెరవేరడంతో హుజూర్ నగర్ వాసులు సంతోషంతో సంబురపడుతున్నారు.

హుజూర్ నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వందల కోట్లు తీసుకురావడం ద్వారా ఒక్కొక్కటిగా అన్ని సమస్యలు తీరి పోతున్నాయి.హుజూర్ నగర్ తోపాటు అన్ని గ్రామాల్లో ప్రజలకు కావాల్సిన మౌళిక వసతులు కల్పిస్తూ అభివృద్ధి చేపడుతున్నారు. 2009లో నియోజ కవర్గంగా ఏర్పడిన హుజూర్ నగర్ లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఉత్తమ్ కుమార్ రెడ్డి దశాబ్దాల తరబడి పేరుకుపోయిన అనేక సమస్యలను ఏడాది, రెండేండ్లలోనే పరిష్కరించారు. కృష్ణ నదిపై మట్టపల్లి బ్రిడ్జిని నిర్మించారు.

లిఫ్ట్ లను ఆధునీకరణ, ఎవరూ ఊహించని విధంగా కృష్ణానది నుంచి హుజూర్ నగర్ కు కృష్ణా జలాలు తెచ్చి హుజూర్ నగర్ ప్రజలకు మురుగు నీటి పీడను దూరం చేశారు. ఇదిలావుండగా.. 14ఏండ్లుగా పాలకులు, అధికారులు అనేక కొర్రీలు పెడుతూ నిరుపేదలకు అసంపూర్తిగా ఉన్న ఇండ్లను నిర్మాణం పూర్తి చేసి ఇండ్ల పట్టాలు ఇవ్వలేదు. కానీ.. అప్పుడు ఇచ్చిన హామీ మేరకు సీఎం రేవంత్ రెడ్డి, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ప్రత్యేకంగా హుజూర్ నగర్ కు తీసుకువచ్చి అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పరిశీలించి వాటికి పునర్జీవం పోశారు అని చెప్పక తప్పదు.

మంత్రి ఉత్తమ్ 14 ఏండ్ల సంకల్పం ఫలించింది

14 ఏండ్ల కిందట హుజూర్ నగర్ పట్టణంలో పేదలకు ఇల్లు నిర్మించి ఇవ్వాలని సంకల్పంతో ఆనాటి ఎమ్మెల్యే,నేటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రామస్వామి గుట్ట వద్ద 112 ఎకరాలలో వివిధ వర్గాలకు చెందిన పేద ప్రజలకు ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. మిగిలిన భూమిలో సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించారు.

దీంతో రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణాలతో బిఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే  మోడల్ కాలనీని పూర్తి చేస్తే ఆనాటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎక్కడ పేరు వస్తుందో అని ఆ మోడల్ కాలనీ పూర్తిగా పక్కన పెట్టేసి డంపింగ్ యార్డ్ గా మార్చారు.. అసంపూర్తిగా ఉన్న మోడల్ కాలనీ ని పూర్తి చేసి ఇల్లు లేని పేద ప్రజలకు పట్టాలు ఇచ్చేందుకు ఎవరికీ మనసు రాలేదు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద మనసుతో పేదలకు ఇండ్ల పట్టాలిచ్చి 20 ఏండ్ల నిరీక్షణను ఫలింపజేసిండ్రు.ఆయనకు మా జన్మాంతం రుణపడి ఉంటాం.

గెల్లి రవి కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు, హుజూర్ నగర్

నిరుపేదలకు రూ.15లక్షల విలువైన ఇండ్లు

హుజూర్ నగర్ పట్టణంలో వివిధ వర్గాలకు చెందిన పేదలు కూలినాలి పనులు చేసుకుంటూ జీవనం గడిపేవారే.తమకు రెక్క ఆడితే కానీ డొక్కాడని వారమని అటువంటి తమకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చొరవతో రూ.15లక్షల నుంచి 20లక్షల రూపాయల విలువ చేసే సింగిల్ బెడ్ రూమ్ ఇండ్లు దక్కాయని లబ్ధిదారులు సంతోషంగా చెప్తున్నారు. 14 ఏండ్లుగా అసంపూర్తిగా ఉన్న మోడల్ కాలనీ ఇండ్ల సమస్యను ఎవరూ పట్టించుకోలేదని, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయం చేశారని చెప్పారు.ఇండ్ల పట్టాలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి జీవితాంతం అండగా ఉంటామంటున్నారు.

 -దొంతగాని శ్రీనివాస్ మున్సిపల్ చైర్మన్, తన్నీరు మల్లికార్జున్ మున్సిపల్ వైస్ చైర్మన్, హుజూర్ నగర్

పది వేలు చూడని మాకు రూ.15లక్షల ఇల్లు ఇచ్చిండు

మేము నిరుపేదలం.ఉండేందుకు ఇల్లు లేక 25 ఏండ్ల కింద హుజూర్ నగర్ లో అద్దె ఇండ్లలో జీవనం సాగిస్తున్నాం. పట్టాల కోసం అటు తిరిగి ఇటు తిరిగి వ్యయ ప్రయాసలు పడ్డాఎవరూ పట్టించుకోలేదు.ఇన్నేండ్లు ఎన్నో పోరాటాలు చేసినం. ఎంతో మంది నాయకుల చుట్టూ తిరిగినం. అయినా ఫలితం లేకుండా పోయింది.

ఎన్నడూ పది వేల రూపాయలు కళ్ల చూడని మాకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రూ.15లక్షల విలువ చేసే ఇంటిపై హక్కులు కల్పిస్తున్నారు.ఈ పట్టా తీసుకొని  ప్రభుత్వం కేటాయించిన ఇంట్లో ఆనందంగా జీవనం కొనసాగిస్తాను.జీవితాంతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి అండగా ఉంటాం.

- నాగమణి,హుజూర్ నగర్

పోరాడి అలిసిపోయిన మాకు దేవుడిలా దారి చూపిండు

25 ఏండ్ల క్రితం ఉండడానికి ఇల్లు లేక ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకున్నాం. తమకు ఇల్లు ఇప్పించాలని ఎంతో మంది నాయకులను, అధికారులను వేడుకున్నాం. అటు తిరిగి ఇటు తిరిగి పోరాడి పోరాడి అలసిపోయాం తప్ప.. ఒక్క నాయకుడూ కనికరించలేదు.

పేదలే కదా రామస్వామి గుట్ట వద్ద అసంపూర్తిగా ఉన్న ఇండ్లను పూర్తి చేసి పేదలకు ఇద్దామని గతంలో ఉన్న ఎమ్మెల్యేకు, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వానికి మనసు రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం మాలాంటి పేదల కోసం మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి  పెద్ద మనసుతో ప్రభుత్వం నుండి అధిక నిధులు తేవడం..దాన్ని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాష్ట్రంలో మొదటి సారి ఇక్కడ అమలు చేయడం మా పేద ప్రజల అదృష్టం.

షేక్ ఖాదర్ భీ, సాయిప్రభాత్ నగర్, హుజూర్ నగర్