నన్ను లాగాలని చూస్తే లీగల్ నోటీసులిస్తా
- డ్రగ్స్ వాడకానికి నేను వ్యతిరేకం.. ఏ పరీక్షకైనా సిద్ధం
- పీసీసీ చీఫ్ సూచనను స్వాగతిస్తున్నా
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, మార్చి 15 (విజయక్రాంతి): ప్రతి డ్రగ్స్ కేసులోకి తన పేరును లాగాలని చూస్తే చట్టపరమైన నోటీసులు ఇస్తానని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా హెచ్చరించారు. డ్రగ్స్ వాడకానికి తాను వ్యతిరేకమని ఆదివారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు. ఏ పరీక్షకైనా తాను సిద్ధమని ఇప్పటికే పలుమార్లు స్పష్టంచేశానని పేర్కొన్నారు.
అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు ఈ పరీక్షలు చేయించుకో వాలన్న పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సూచనను స్వాగతిస్తున్నానని తెలిపారు. మనమే ఆదర్శంగా నిలుద్దామని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాలు మనుషులను రాక్షసులుగా మారుస్తాయని, బాధ్యతాయుతమై న పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా డ్రగ్స్ వాడకానికి పాల్పడటం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్, అక్రమ పదార్థాల వాడకానికి పూర్తిగా తాను వ్యతిరేకమని వెల్లడించారు.
డ్రగ్స్ వాడకాన్ని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను బీఆర్‌ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని పేర్కొన్నారు. డ్రగ్స్ వాడుతున్న వారు లేదా విక్రయిస్తున్న వారు (పెడ్లర్లు), వారి రాజకీయాలతో సంబంధం లేకుండా చట్టప్రకారం కఠినంగా శిక్ష అనుభవించాలని స్పష్టంచేశారు. ఈ అంశంలో నీచమైన రాజకీయాల కోసం బీఆర్‌ఎస్ పా ర్టీని లాగుతున్న తీరును తీవ్రంగా ఖండించారు.
డ్రగ్స్ కేసును బీఆర్‌ఎస్ పార్టీకి ఆపా దిస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వాడుకోవడం మీ అసహ్యకరమైన రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ప్రభుత్వం తీసుకునే ఏ నిర్ణయానికైనా తమ మద్దతు ఉంటుందని, కానీ వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మాత్రం సహించబోమని తేల్చిచెప్పారు.




