గుజరాత్ హ్యాట్రిక్
మళ్లీ ఓడిన కోల్ కతా
గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్
కేకేఆర్‌కు ఐదో ఓటమి
ఐపీఎల్ 19వ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ జోరు కొనసాగుతోంది. హోంగ్రౌండ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. కీలక బ్యాటర్లు విఫలమైన వేళ కామెరూన్ గ్రీన్ కేకేఆర్‌ను ఆదుకుంటే.. చివర్లో జిడ్డు బ్యాటింగ్‌తో ఆ జట్టు తక్కువ స్కోరుకే పరిమితమయ్యేందుకు పరోక్షంగా కారణమయ్యాడు. మరోవైపు గిల్ తన సూపర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ హాఫ్ సెంచరీ సాధించాడు. ఫలితంగా కేకేఆర్‌కు ఐదో ఓటమి తప్పలేదు.
అహ్మదాబాద్, ఏప్రిల్ 17: ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనింగ్ కాంబినేషన్‌ను మార్చినా కేకేఆర్‌కు మాత్రం కలిసి రాలేదు. పేలవ ఫామ్‌తో ఉన్న రహానే మరోసారి ఫెయిలయ్యాడు. ఖాతా కూడా తెరవకుండానే వెనుదిరిగాడు. రఘువంశీ(8) కూడా నిరాశపరిచా డు. అటు ఫిన్ అలెన్ స్థానంలో జట్టులోకి వచ్చిన సిఫెర్ట్ 2 ఫోర్లు, 1 సిక్సర్ కొట్టి ఊపు మీద కనిపించినా కాసేపటికే ఔటయ్యాడు. దీంతో కోల్‌కతా నైట్ రైడర్స్ 32 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో కామెరూన్ గ్రీన్, రోవమన్ పావెల్ ఆదుకున్నారు. ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడని గ్రీన్ ఈ మ్యాచ్‌లో రాణించాడు. వీరిద్దరూ నాలుగో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. పావెల్ ఔట్ అయిన తర్వాత గ్రీన్ తన బ్యాట్‌కు పనిచెప్పాడు. కేవలం 34 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న గ్రీన్.. మొత్తం 79 పరుగులతో కేకేఆర్ స్కోరును 180కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అనుకుల్ రాయ్ (9) తో కలిసి ఐదో వికెట్కు 60 పరుగులు జోడించాడు.
అటు కేకేఆర్ స్టార్ ప్లేయ ర్ రింకూ సింగ్ (1) ఈ మ్యాచ్లోనూ నిరాశపరిచాడు. రమణ్దీప్ సింగ్ (17), సునీల్ నరైన్ (0), కార్తీక్ త్యాగి (6) కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. నిజానికి ఒక దశలో 220 పరుగుల వరకూ స్కోర్ చేస్తుందనుకున్న కోల్‌కతా తక్కువ స్కోరుకే పరిమితమవ డానికి కామెరూన్ గ్రీన్ నే కారణంగా చెప్పా లి. ధాటిగా ఆడాల్సిన స్లాగ్ ఓవర్లలో పలు డాట్ బాల్స్ ఆడడం, సింగిల్స్‌కే పరిమితం కావడం కొంపముంచింది.
ఒక్క మాటలో చెప్పాలంటే మంచి ఇ న్నింగ్స్ ఆదుకున్న గ్రీన్ తర్వాత అదే జిడ్డు బ్యాటింగ్ తో కోల్‌కతా స్కోరును తక్కువకే పరిమితవడానికి కారణమయ్యాడు. కాగా గుజరాత్ బౌలర్లలో రబాడ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 కీలక వికెట్లు తీశాడు. సిరాజ్, అశోక్ శర్మ రెండేసి వికెట్లు పడగొట్టగా... ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.181 పరుగుల లక్ష్యఛేదనలో గుజరాత్ టైటాన్స్‌కు మంచి ఆరంభమే దక్కిం ది. ఓపెనర్లు సాయి సుదర్శన్(22), గిల్‌తో కలిసి తొలి వికెట్‌కు 5.1 ఓవర్లలో 57 పరుగులు జోడించాడు.
తర్వాత బట్లర్, గిల్ 38 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. క్రీజులోకి వచ్చీరాగానే బట్లర్ సిక్సర్, ఫోర్ బాదాడు. అటు గిల్ కూడా దూకుడు పెంచడంతో గుజరాత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. బట్లర్ (25) రన్స్‌కు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ (13)తో కలిసి గిల్ 46 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పాడు. దీంతో గుజరాత్ విజయం ఖాయమైంది. అయితే విజయానికి 22 పరుగుల దూరంలో గిల్ 86 (8 ఫోర్లు, 4 సిక్సర్లు) పరుగులకు ఔటయ్యాడు. తర్వాత గ్లెన్ ఫిలిప్స్, తెవాటియా, షారూఖ్ ఖాన్ గుజరాత్ విజయాన్ని పూర్తి చేశారు. దీంతో గుజరాత్ టైటాన్స్ మరో 2 బంతులు మిగిలుండగా విజయం సాధించింది. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది.
స్కోరు బోర్డు
కోల్ కతా నైట్ రైడర్స్ ఇన్నింగ్స్ : 180 ( గ్రీన్ 79, పావెల్ 27, సిఫర్ట్ 19, రబాడ 3/29, సిరాజ్ 2/23, అశోక్ శర్మ 2/45 )
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ : 181/5 ( గిల్ 86, బట్లర్ 25, సాయి సుదర్శన్ 22, వరుణ్ చక్రవర్తి 2/34, వైభవ్ అరోరా 1/35 )






