డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడు అరెస్ట్
హైదరాబాద్: డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు. మంగళ్‌హాట్ పరిధిలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు పోలీసులకు నిఘావర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో మాదక ద్రవ్యాల అమ్మకాలపై నిఘా పెట్టిన ఈగల్ టీమ్, లా అండ్ ఆర్డర్, ఎక్సైజ్ పోలీసులు రెగ్యులర్ గా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో డ్రగ్స్ కొనుగోలు చేసేందుకు వచ్చిన ఎమ్మెల్సీ కుమారుడైన భరత్ పోలీసులకు పట్టుబడ్డారు. ఈ కేసులో ఎమ్మెల్సీ కుమారుడితో పాటు పలువురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టులు జరిగాయని, దీనిపై విచారణ కొనసాగుతోందని, అరెస్టు అయిన వారిని ఎమ్మెల్సీ కుమారుడైన భరత్ రాజ్ రెడ్డితో పాటు అభిషేక్, యునిత్‌లుగా గుర్తించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. పురానాపుల్ ప్రాంతంలో గంజాయి, హ్యాష్ ఆయిల్‌ను కొనుగోలు చేసి సేవించడంలో ఏడుగురు వ్యక్తుల బృందం ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆపరేషన్ సమయంలో పోలీసులు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకోగా, మరో నలుగురు తప్పించుకున్నారు.
పరారైన వారిని సోని, వంశీ, మనోజ్, తుల్జాలుగా గుర్తించారు. వారిని గుర్తించి పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. అరెస్టు చేసిన వారి నుంచి 24 గ్రాముల హ్యాష్ ఆయిల్ సాచెట్లు, 22 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి, తదుపరి దర్యాప్తు చేపడుతమన్నారు. ఒక ఎమ్మెల్సీ కుమారుడి ప్రమేయం ఉందన్న ఆరోపణల కారణంగా ఈ అరెస్టులు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసు అధికారులు తెలిపారు.






