బెంగళూరుకు ఎదురుందా?
ఢిల్లీ క్యాపిటల్స్‌తో బిగ్ ఫైట్
సూపర్ ఫామ్‌లో కోహ్లీ, పటిదార్
నిలకడలేమితో ఢిల్లీ బ్యాటింగ్
బెంగళూరు, ఏప్రిల్ 17: ఐపీఎల్ 19వ సీజన్‌లో ఢిపెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తన హోంగ్రౌండ్‌లో మరో ఆసక్తికర పోరుకు రెడీ అయింది. శనివారం మధ్యాహ్నం చిన్నస్వామి స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడబోతోంది. ఈ సీజన్ ఆరంభం నుంచీ ఛాంపియన్ హోదాకు తగ్గట్టే ఆర్సీబీ ఆడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ లలో అదరగొడుతోంది. రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్‌లో తప్పిస్తే మిగిలిన జట్లపై పూర్తి ఆధిపత్యం కనబరిచింది.
ప్రస్తుతం బెంగళూరు ఐదు మ్యాచ్ లలో నాలుగు విజయాలతో 9 పాయింట్లు ఖాతాలో వే సుకుంది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో రెం డో స్థానంలో కొనసాగుతోంది. ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్‌పై గెలిస్తే టాప్ ప్లేస్‌కు దూసుకెళుతుంది. అదే సమ యంలో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత పటిష్టం చేసుకుంటుంది. ఆర్సీబీ జట్టులో కీలక ఆటగాళ్ళందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. ఫిల్ సాల్ట్ , కోహ్లీ ఓపెనింగ్ బెంగళూరుకు మరోసారి అడ్వాంటేజ్ గా మారింది. గత మ్యాచ్‌లో కోహ్లీని ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడించడం, ఆరోగ్యం సరిగా లేకున్నా విరాట్ మాత్రం సూపర్ హాఫ్ సెంచరీతో చెలరేగిపోవడం అభిమానులు చూసారు.
మరోసారి అలాంటి ఇన్నింగ్స్ కోహ్లీ నుంచి కోరుకుంటున్నారు. అలాగే రజత్ పటిదార్ కెప్టెన్ ఇన్నింగ్స్‌లతో దుమ్మురేపుతున్నాడు. పడిక్కల్, జితేశ్ శర్మలతో పాటు టిమ్ డేవిడ్ ఫినిషర్ రోల్‌లో అదరగొట్టేస్తున్నాడు. రొమారియో షెపర్ట్ కూడా చివర్లో హిట్టింగ్ చేస్తున్నాడు. అటు బౌలింగ్‌లో భువనేశ్వర్ కు మార్, హ్యాజిల్‌వుడ్ ఫామ్ అందుకున్నారు. గత మ్యాచ్ లో భువనేశ్వర్ అదిరిపోయే స్పెల్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు వణుకు పుట్టించాడు.అటు యువ పేసర్ రసిక్ సలామ్ దార్ కూడా ఆకట్టుకున్నాడు. స్పిన్ విభాగంలో ఆల్ రౌం డర్ కృనాల్ పాండ్యా ఆర్సీబీకి ప్రధాన బలం. సుయాశ్ శర్మ మ్యాజిక్ కూడా అడ్వాంటేజ్ గా చెప్పొచ్చు.
మరోవైపు సీజన్‌ను అద్భుతమైన విజయాలతో ఆరంభించిన ఢిల్లీ తర్వాత వరుస పరాజయాలతో డీలా పడింది. గత రెండు మ్యాచ్‌లలోనూ ఓడిపోయింది. బ్యాటింగ్‌లో నిలకడలేమి, బౌలింగ్‌లో సమిష్టితత్వం లేకపోవడం ఢిల్లీ ఓట ములకు కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం నాలుగు మ్యాచ్‌లు ఆడి రెండు విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ వై ఫల్యం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇబ్బందిగా మారింది. గత సీ జన్‌లో పరుగుల వరద పారించిన రాహుల్ ఈ సీజన్‌లో ఇప్పటి వరకూ చెప్పుకోదగిన ఇన్నింగ్స్ ఆడలేదు.
తుది జట్లు అంచనా
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిల్ సాల్ట్, కోహ్లీ, పటిదార్ (కెప్టెన్), జితేశ్ శర్మ (కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, రొమారియో షెఫర్డ్, భువనేశ్వర్ , హ్యాజిల్‌వుడ్, రసిక్ సలామ్ దార్, సుయాశ్ శర్మ
ఢిల్లీ క్యాపిటల్స్ : నిస్సాంక, కేఏల్ రాహుల్(కీపర్), సమీర్ రిజ్వీ, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, స్టబ్స్, అకీబ్ నబీదార్, లుంగి ఎంగిడి, కుల్దీప్ యాదవ్, నటరాజన్, ముకేశ్ కుమార్






