16 July, 2026 | 10:47 AM

అశ్వాపురంలో బీఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్టులు

16-07-2026 10:32 AM

అశ్వాపురం,(విజయక్రాంతి): రాష్ట్ర మంత్రుల పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన "చలో మణుగూరు" పిలుపుతో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అశ్వాపురం మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు కోడి అమరేందర్, మండల ప్రధాన కార్యదర్శి మర్రి మల్లారెడ్డిని గురువారం పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మంత్రుల పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా ఈ చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అయితే, ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తూ శాంతియుతంగా నిరసన తెలిపే అవకాశాన్ని కూడా కల్పించకుండా తమ పార్టీ నాయకులను అకారణంగా ముందస్తు అరెస్టు చేయడం అన్యాయమని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా పలువురు పార్టీ నాయకులను ఇళ్ల వద్దే నిర్బంధించడం, కొందరిని పోలీస్ స్టేషన్లకు తరలించడం ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని ఆరోపించారు. అశ్వాపురంలో ఈ ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారగా, పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పోలీసులు మండలంలోని పలు ప్రాంతాల్లో బందోబస్తును కట్టుదిట్టం చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.