కళతప్పిన జలాశయాలు
ఉమ్మడి కరీంనగర్‌లో ప్రాజెక్టులు వెలవెల
- జిల్లాలో 20 శాతానికే పరిమితమైన వరి సాగు
- పొలాల్లోనే ఎండిపోతున్న వరినార్లు
- మెదక్ జిల్లాలో నెర్రెలు బారిన భూములు
సాగు సంకటమే!
గ్రౌండ్ రిపోర్ట్-2
కరీంనగర్/సంగారెడ్డి, జూలై 15 (విజయక్రాంతి): తెలంగాణ వ్యాప్తంగా వానాకాలం సీజన్ ప్రారంభమై నెలన్న ర గడుస్తున్నా, వరుణుడి కటాక్షం లేక రాష్ట్రం తీవ్ర కరవు కోరల్లో చిక్కుకుంది. గతేడాది ఇదే సమయానికి కుండపోత వర్షాలు, నిండుకుండల్లాంటి జలాశయాలతో కళకళలాడిన పల్లెలు.. నేడు వానల్లేక, నీటి చుక్క దొరక్క వెలవెలబోతున్నాయి. జూన్, జూలై నెలల్లో కుర వాల్సిన సాధారణ వర్షపాతంలో దాదాపు 30-40 శాతం వరకు లోటు నమోదు కావడంతో కరవు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
నాట్లు పడాల్సిన సమయం దాటిపోతున్నా ఆకా శం వైపు ఆశగా ఎదురుచూడటం మిన హా అన్నదాతలకు మరో దారిలేకుండా పోయింది. కృష్ణా, గోదావరి బేసిన్లలోని ఎగువ ప్రాజెక్టుల నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో శ్రీశైలం, నాగార్జునసాగర్, సింగూరు, శ్రీరాంసాగర్ వంటి ప్రధాన జలాశయాలన్నీ అడుగంటి డెడ్ స్టోరేజికి చేరువయ్యా యి. భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది బోరుబావుల్లో నీరు అడు గంటింది. ఒకవైపు కళ్లముందే ఎండిపోతున్న నారుమళ్లు, మరోవైపు అప్పుల భారం.. వెరసి తెలంగాణ రైతాంగం గుండెకోత అనుభవిస్తోంది.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షాభావ పరిస్థితులు, ఎల్ నినో ప్రభావం కారణంగా వరిసాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 9 లక్షల ఎకరాలు కాగా ఇప్పటి వరకు 2 లక్షల ఎకరాల్లో కూడా వరిసాగు కాలేదు. రైతులు సాగు కోసం సిద్ధం చేసిన వరినార్లు ఎండిపోతున్నాయి. ప్రధాన ప్రాజక్టులైన శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్ మానేరు, దిగువ మానేరు (ఎఫ్‌ఎండీ), ఎగువ మానేరు ప్రాజెక్టులలో నీటిమట్టాలు పడిపోయి ఎడారిని తలపిస్తున్నాయి.
ఏటా జూన్, జూలైలో కురిసే వర్షాలతో ఆగస్టులో ప్రాజెక్టులు నిండి మత్తడి దూకుతుంటాయి. అయితే ఈసారి జూలై 15 వరకు ఏ జిల్లాలో కూడా సాధారణ వర్షపాతం నమోదు కాకపోవడం, మహారాష్ట్ర, నాసిక్‌లో వర్షాలు లేక గోదావరి ప్రవాహం లేకపోవడంతో ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో లేకుండా పోయింది. జూన్ నుంచి జూలై 15 వరకు ఈ 45 రోజుల్లో కరీంనగర్ జిల్లాలో- 42, జగిత్యాల జిల్లాలో -42, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో-39, పెద్దపల్లి జిల్లాలో 28 శాతం వర్షపాతం నమోదయింది.
ప్రాజెక్టుల్లో తగ్గిన నీటి మట్టం..
మిడ్ మానేరు సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 7.44 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ సమాయానికి గత సంవత్సరం 9 టీఎంసీల నీరు ఉంది. ఎల్‌ఎండీలో 24,034 టీఎంసీల సామర్థ్యానికి 5.60 టీఎంసీల నీరు ఉంది. గత సంవత్సరంలో ఈ సమయానికి 6.113 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులో జూలై 15న 7.84 టీఎంసీల నీరు ఉండగా, గతేడాది ఇదే రోజు 8.982 టీఎంసీల నీరు ఉంది.
ఈ ప్రాజెక్టు జూలై 15 నాటికి గత సంవత్సరం ఇన్ ఫ్లో ప్రారంభం కాగా ప్రస్తుతం ఇన్ ఫ్లో లేదు. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఎల్లంపల్లి, ఎల్‌ఎండీలో 1 టీఎంసీ మేర నీరు తగ్గుముఖం పట్టగా, మిడ్ మానేరులో 2 టీఎంసీలు తగ్గి ఎడారిని మరిపిస్తుంది. గంభీరావుపేటలోని నర్మాలలోగల అప్పర్ మానేరు నీటి సామర్థ్యం 2 టీఎంసీలు కాగా ప్రస్తుతం 0.63 టీఎంసీల నీరు ఉంది.
పాతాళానికి భూగర్భ జలాలు..
ఉమ్మడి మెదక్ జిల్లాలో సాధారణంగానే భూగర్భ జలాలు తక్కువ. ప్రస్తుత కరువు తీవ్రత వల్ల జిల్లాలోని పలు మండలాల్లో భూగర్భ జలమట్టాలు వందల అడుగుల లోతుకు పడిపోయాయి. గతంలో 300 అడుగుల లోతులోనే పడిన నీరు, ఇప్పుడు 800 నుండి 1000 అడుగులు తవ్వినా చుక్క నీరు పడటం లేదు. ఉన్న బోర్లు ఎండిపోవడంతో రైతులు ఒకే పొలంలో మూడు, నాలుగు కొత్త బోర్లు వేస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకప్పుడు 24 గంటలు నీరు పోసిన బోర్లు, ఇప్పుడు ఐదు నిమిషాలు కూడా నడవకుండా గాలిని కక్కుతున్నాయి. దీంతో వేలాది రూపాయలు పెట్టి వేసిన బోర్లు నిరుపయోగంగా మారుతున్నాయి.
బతుకుదెరువు కోసం వలసలు..
వ్యవసాయం కలిసి రాకపోవడం, గ్రామాల్లో కూలి పనులు దొరక్కపోవడంతో చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు బతుకుదెరువు కోసం వలస బాట పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని నారాయణఖేడ్, జహీరాబాద్, దుబ్బాక, గజ్వేల్, ఆందోల్ పరిసర ప్రాంతాల నుండి ప్రతిరోజూ వందలాది కుటుంబాలు హైదరాబాద్‌తో పాటు పక్కనే ఉన్న కర్ణాటక, మహారాష్ట్ర వంటి ప్రాంతాలకు నిర్మాణ రంగానికి కూలీలుగా వలస పోతున్నారు. పల్లెల్లో ముసలివారు, పిల్లలు తప్ప యువత కనిపించని పరిస్థితి నెలకొంది.
మెతుకు సీమలో బతుకుదెరువు కోసం వలసల బాట?
ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన, మధ్యతరహా, చిన్నపాటి జలాశయాలు నీరు లేక వెలవెలబోతుండటంతో.. ఎటుచూసినా ఎండిపోతున్న పంటపొలాలు, నెర్రెలు బారిన భూములే దర్శనమిస్తున్నాయి. ఈ సీజన్‌లో ఆశించిన స్థాయిలో వర్షపాతం నమోదు కాకపోవడం, ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పూర్తిగా నిలిచిపోవడంతో జలాశయాలు అడుగంటాయి. జిల్లాకు గుండెకాయ వంటి సిం గూరు డ్యామ్ క్రమంగా డెడ్ స్టోరేజ్ చేరువవుతోంది.
హైదరాబాద్ నగర తాగునీటి అవసరాలకు, స్థానిక వ్యవసాయానికి నీటిని సర్దుబాటు చేయడం అధికారులకు కత్తిమీద సాములా మారింది. ప్రాజెక్టు పరిధిలోని కాలువలు నీరు లేక ఎండిపోయాయి. ఇక మంజీరా నదిపై ఆధారపడిన వందలాది ఎకరాల ఆయకట్టు ఇప్పుడు ఎడారిని తలపిస్తోంది. హల్దీవాగు ప్రాజెక్టులో నీటి నిల్వలు పూర్తిగా పడిపోవడంతో ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. ఘనపూర్ ఆనకట్ట కింద వరి సాగు చేసిన రైతులు ఇప్పుడు నీటి చుక్క కోసం ఆకాశం వైపు చూస్తున్నారు.
గతంలో పూడికతీత పనులు చేపట్టి తాత్కాలికంగా జలకళను సంతరించుకున్న గొలుసుకట్టు చెరువులు, కుంటలు జనవరి, ఫిబ్రవరి నెలల్లోనే ఎండిపోయాయి. చెరువుల కింద బోర్లపై ఆధారపడి వేసిన పంటలు ఇప్పుడు నిలువునా ఎండిపోతున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గత వానాకాలంలో 7.19 లక్షల ఎకరాలు సాగవగా, ప్రస్తుతం జూలై మధ్యనాటికి 2.50 లక్షల ఎకరాలు కూడా దాటడం లేదు.
ఉమ్మడి జిల్లాలో గత వానాకాలంలో మొత్తం సాగు విస్తీర్ణం 7.19 లక్షల ఎకరాలు కాగా ప్రస్తుతం జూలై ౧౫ నాటికి 2.50 లక్షల ఎకరాల లోపే నమోదైంది. వరి సాగు గతేడాది లక్ష్యం కంటే 92% పూర్తికాగా ఇప్పుడు 20% లోపే నాట్లు పడ్డాయి. భూగర్భ జలాలు గతేడాది సగటున 6.5 మీటర్ల లోతు వరకు ఉండగా.. ఇప్పుడు అత్యధికంగా 3.41 మీటర్ల లోతుకు చేరుకున్నాయి. గతేడాది జలాశయాలు నీటితో నిండుకుండల్లా ఉండగా.. ఈసాది సింగూరు డెడ్ స్టోరేజీకి (4.47 టీఎంసీలు) చేరింది.
ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలి
ఎల్ నినో ప్రభావంతో ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు అడుగులు వేయవలసి ఉంది. ప్రతి గ్రామంలో సమావేశాలు ఏర్పాటు చేసి రైతు వేదికల ద్వారా రైతులకు ఆరుతడి పం టలు, చిరు ధాన్యాల పంటలవైపు మొగ్గుచూపే విధంగా అవగాహన కల్పిస్తున్నాం.
కరీంనగర్ జిల్లాలో ఈ వానకాలంలో 2 లక్షల 70 వేల ఎకరాల్లో వరిసాగు లక్ష్యం కాగా ఇప్పటి వరకు 54,003 ఎకరాల్లో మాత్రమే వరిసాగు చేశారు. అది కూడా బావుల కింద సాగు చేశారు. పత్తి సాగు మాత్రం ఆశాజనకంగా ఉంది. జిల్లాలో 38,605 ఎకరాల్లో ఇప్పటి వరకు సాగు చేశారు. మొక్కజొన్న 2366 ఎకరాల్లో సాగు చేశారు.
భాగ్యలక్ష్మి,
జిల్లా వ్యవసాయశాఖ అధికారి,
కరీంనగర్






