20 June, 2026 | 4:06 AM

విద్యా వ్యాపారం.. పుస్తకాల పేరుతో దోపిడీ?

20-06-2026 01:27 AM

ప్రైవేట్ పాఠశాలలు బుక్స్టాళ్ల అనుబంధంపై పెరుగుతున్న అనుమానాలు

ఇల్లందు టౌన్, జూన్ 19 (విజయక్రాంతి): కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే ప్రైవేట్ పాఠశాలల్లో పుస్తకాల కొనుగోలు పేరుతో తల్లిదండ్రులపై భారీ ఆర్థిక భారం పడుతోందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పుస్తకాలు, నోట్బుక్కులు, వర్క్బుక్స్ పేరుతో వేల రూపాయల ఖర్చు తప్పనిసరి అవుతుండటంతో మధ్యతరగతి, పేద కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పలువురు పేర్కొంటున్నారు.

ఒకే బుక్స్టాల్కు ఎందుకు పరిమితం?

కొన్ని పాఠశాలలు సూచించిన బుక్స్టాళ్లలోనే పుస్తకాలు కొనుగోలు చేయాలని తల్లిదండ్రులకు సూచిస్తున్నట్లు సమాచారం. మార్కెట్లో ఇతర దుకాణాల్లో కూడా పుస్తకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, నిర్దిష్ట దుకాణాలకే పరిమితం చేయడం వెనుక కారణాలేమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

పుస్తకాల ధరలపై నియంత్రణ లేదా?

ఒక విద్యార్థికి పుస్తకాల కొనుగోలుకే వేల రూపాయలు ఖర్చవుతోందని తల్లిదండ్రులు వాపోతున్నారు. పుస్తకాల ధరలను ఎవరు నిర్ణయిస్తున్నారు? వాటిపై పర్యవేక్షణ ఉందా? ధరల విషయంలో పారదర్శకత పాటిస్తున్నారా? అనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది.

తల్లిదండ్రుల ఆవేదన

పిల్లల చదువుకు ఎంత ఖ్చనా భరిస్తామని, కానీ అవసరానికి మించిన పుస్తకాల కొనుగోలు భారంగా మారుతోందని పలువురు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఒక కుటుంబంలో ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలు ఉంటే విద్యా ఖర్చులు మరింత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నిబంధనలు ఉన్నా అమలు ఎక్కడ?

విద్యార్థులు తమకు అనుకూలమైన దుకాణంలో పుస్తకాలు కొనుగోలు చేసుకునే అవకాశం ఉండాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. అయితే కొన్ని ప్రాంతాల్లో తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై సంబంధిత శాఖలు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

జిల్లా అధికారులు స్పందించాల్సిన సమయం

విద్య హక్కుగా ఉన్న దేశంలో పుస్తకాల కొనుగోలు భారంగా మారకూడదు. పుస్తకాల ధరలు, పాఠశాలలు సూచిస్తున్న జాబితాలు, తల్లిదండ్రుల ఫిర్యాదులపై సంబంధిత అధికారులు దృష్టి సారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ప్రశ్నలు ఇవే...

- పాఠశాలలు నిర్దిష్ట బుక్స్టాళ్లనే ఎందుకు సూచిస్తున్నాయి?

- పుస్తకాల ధరలపై పర్యవేక్షణ ఉందా?

- తల్లిదండ్రుల ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?

- ప్రతి ఏడాది కొత్త పుస్తకాల పేరుతో అదనపు భారం ఎందుకు పెరుగుతోంది?

- విద్యాశాఖ తనిఖీలు క్రమం తప్పకుండా జరుగుతున్నాయా? - తదితర ప్రశ్నలకు సమాధానాలు బహిర్గతం కావలసి  ఉంది