16 July, 2026 | 12:32 AM

ఏసీబీ వలలో భూగర్భ జలశాఖ అధికారి

16-07-2026 12:10 AM
  1. బోర్‌వెల్ యజమాని నుంచి రూ.20 వేలు డిమాండ్                               
  2. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడిన అసిస్టెంట్ డైరెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్  

సూర్యాపేట, జులై 15 (విజయక్రాంతి): సూర్యాపేట జిల్లా భూగర్భ జలశాఖ కార్యాలయంలో బోరు బావి డ్రిల్లింగ్ రిగ్ అనుమతి కోసం రూ.20 వేలు లంచం డిమాండ్ చేసిన ఇద్దరు ఉద్యోగులను బుధవారం ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  జిల్లా భూగర్భ జల శాఖ అధికారి మెగావత్ బాలు నాయక్ తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ (అవుట్ సోర్సింగ్ ఉద్యోగి) కొసరాజు వెంకటేశ్వర్లును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

నల్లగొండ రేంజ్ ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ముందుగా అందిన ఫిర్యాదును పరిశీలించిన ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో భూగర్భ జల శాఖ అధికారి బాలు సూచన మేరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి నేరుగా లంచం స్వీకరిస్తున్న సమయంలో దాడి నిర్వహించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు.

అనంతరం లంచం నగదును స్వాధీనం చేసుకుని అవసరమైన ఆధారాలను సేకరించి నిందితులను ప్రశ్నించి కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తదుపరి నిందితులను వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులు వెల్లడించారు.