15 July, 2026 | 9:35 PM

బాచుపల్లిలో బరితెగించి అక్రమ నిర్మాణాలు

15-07-2026 09:15 PM

గతంలో కూల్చిన చోటే మళ్లీ భారీ స్విమ్మింగ్ పూల్

తూ తూ మంత్రంగా నోటీసులు

పాక్షిక కూల్చివేతలతో చెలరేగి పోతున్న అక్రమార్కులు

గెలాక్సీ స్విమ్మింగ్ పూల్ పై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు

కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బిల్డర్లు బరితెగిస్తే ఎలా ఉంటుందో ఓ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. నోటీసులు జారీ చేసి, కూల్చివేసినా కూడా తన అతి తెలివి ప్రదర్శిస్తూ స్విమ్మింగ్ పూల్ నిర్మాణాన్ని పూర్తి చేశాడు. నిజాంపేట్ సర్కిల్ పరిధిలోని బాచుపల్లి  డివిజన్ రేణుక ఎల్లమ్మ కాలనీలో ఓ బిల్డర్ గతం లో అనుమతులకు విరుద్ధంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణం చేపట్టాడు. అయితే టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పై ఫిర్యాదులు అందడంతో సదరు బిల్డర్ కు నోటీసులు జారీ చేశారు.

తూ తూ మంత్రంగా నోటీసులు, కూల్చివేతలు

టౌన్ ప్లానింగ్ అధికారులకు అక్రమ నిర్మాణంపై గతం లో పలు ఫిర్యాదులు అందడంతో తూ తూ మంత్రంగా నోటీసులు జారీ చేసి, కూల్చివేశారు. అయినా సరే బిల్డర్ బరితెగిస్తూ అధికారులకు అమ్యమ్యాల రుచి చూపించి,నన్ను ఏమీ చెయ్యలేరనే ధీమా వ్యక్తం చేస్తూ స్విమ్మింగ్ పూల్ నిర్మాణం పూర్తి చేశాడు. సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకున్న కూడా కొందరి బిల్డర్లలో ఎలాంటి మార్పు రాకపోవడం స్థానికులను విస్మయానికి గురి చేస్తోంది. అధికారులు మారినా అక్రమ నిర్మాణదారులలో ఎలాంటి మార్పు రాదు అనే భావన స్థానికులలో రోజురోజుకి బలపడుతుంది.

మామూళ్ళ కోసమే పై పై కూల్చివేతలంటూ ఆరోపణలు

అధికారులు అక్రమ నిర్మాణాలపై నోటీసులు జారీ చేసి, పై పై కూల్చివేతలు చేపట్టడం పట్ల స్థానికులలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మామూళ్ళ కోసమే కూల్చివేతలంటూ ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.అంతే కాకుండా నిజాంపేట్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారులు మామూళ్ళ మత్తులో మునిగి తేలుతున్నారంటూ స్థానికంగా విమర్శలు ఉన్నాయి.ఒకసారి అధికారులు చర్యలు తీసుకున్న తర్వాత ఆ అక్రమ నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు అటువైపు కన్నెత్తి చూడరు.ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న స్విమ్మింగ్ పూల్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

పరిశీలించి చర్యలు తీసుకుంటాము:సర్కిల్ ఏసీపీ శ్రీనివాస్

స్విమ్మింగ్ పూల్ నిర్మాణంపై నిజాంపేట్ సర్కిల్ ఏసీపీ శ్రీనివాస్ ను వివరణ కోరగా పూర్తి దర్యాప్తు చేసి, చర్యలు తీసుకుంటామని తెలిపారు.