16 July, 2026 | 12:19 AM

కాంగ్రెస్‌లో సహకార సందడి

16-07-2026 12:00 AM
  1. ఒకవైపు కోర్టులో కేసు.. మరోవైపు దరఖాస్తుల స్వీకరణ 
  2. మేడ్చల్ సమావేశంలో ఆశావహుల ఆసక్తి 
  3. జిల్లాలో తొమ్మిది సహకార సంఘాలు 
  4. చైర్మన్, డైరెక్టర్ పదవులకు డిమాండ్ 

మేడ్చల్, జూలై 15 (విజయశాంతి): మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో సహకార పదవుల సందడి నెలకొంది. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు డిసిసి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. బుధవారం మేడ్చల్ శివారు లోని జిఎన్‌ఆర్ గార్డెన్ లో సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

సహకార పదవుల విషయమై కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం కనిపిస్తున్నప్పటికీ..... మరోవైపు కోర్టులో కేసు ఉండడం వల్ల నియామక ప్రక్రియ జరుగుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతు న్నాయి. దీనికి సంబంధించిన హియరింగ్ హైకోర్టులో ఈనెల 17న జరగనుంది. కోర్టు తీర్పు వెలువడే వరకు ఆగకుండా ముందుగానే సమావేశాలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు 

హైకోర్టులో రిట్ పిటిషన్ 

రాష్ట్రంలో ఇటీవల 14 సహకార సంఘాలకు ఒకసారి, ఆరు సంఘాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పాలకవర్గాలను నామినేట్ చేసింది. దీనిపై ఆయా సంఘాల చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల అయ్యేవరకు పాత పాలకవర్గాలను కొనసాగిం చాలని హైకోర్టు సూచించినప్పటికీ దానికి విరుద్ధంగా నామినేట్ చేయడం సరికాదని చైర్మన్లు పేర్కొన్నారు. పిటిషన్ విచారించిన హైకోర్టు ఈనెల 17వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. 

గతంలో పాలకవర్గాలకు అనుకూలంగా తీర్పు 

సహకార సంఘాల పాలకవర్గాల పదవీకాలం ముగిసినప్పటికీ ప్రభుత్వం తొలగిస్తూ వచ్చింది. 2025 డిసెంబర్ 19న 597 జీవో ద్వారా పాలకవర్గాలను రద్దు చేసింది. దీనిపై చైర్మన్లు కోర్టును ఆశ్రయించగా, సహకార సంఘాలకు ఎన్నికలు జరిగే వరకు పాలకవర్గాలను కొనసాగించాలని సూచించింది. దీంతో ప్రభుత్వం జీవోను ఉపసంహరించుకుంది.

దీంతో రాష్ట్రంలోని సహకార సంఘాల పాలకవర్గాలు మళ్లీ బాధ్యతలు స్వీకరించాయి. ఎన్నికలు జరిగే వరకు పాలకవర్గాలను కొనసాగించాలని హైకోర్టు సూచించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ నామినేటెడ్ ద్వారా పాలకవర్గాలను నియమిస్తోంది. అంతేగాక అప్పట్లోనే జీవోను ఉపసంహరించుకుంది.

17న రానున్న స్పష్టత 

హైకోర్టు 17న ఈ కేసును విచారించనున్న నేపథ్యంలో ఆరోజు పాలకవర్గాల నియామకంపై స్పష్టత రానుంది. ఎన్ని కల యే వరకు పాత పాలకవర్గాలను కొనసాగిస్తారా? లేక నామినేటెడ్ ద్వారా నియా మకానికి అనుమతిస్తారా అనేది తేలనుంది. ఎన్నికల అయ్యేవరకు తామే కొనసాగుతామని పాలకవర్గ సభ్యులు ధీమాతో ఉన్నారు. గతంలో హైకోర్టు ఎన్నికల అయ్యేవరకు పాత పాలకవర్గాలను కొనసాగించాలని సూచించిందని వారు గుర్తు చేస్తున్నారు. 

జిల్లాలో సహకార పదవులకు డిమాండ్ 

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో సహకార సంఘాల చైర్మన్ పదవులకు బాగా డిమాండ్ ఏర్పడింది. గ్రామాలను మున్సిపాలిటీలలో, మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లలో విలీనం చేయడంతో పదవులు తగ్గిపోయాయి. ఈ పరిస్థితుల్లో సహకార పదవులను ఆశిస్తున్నారు. జిల్లాలో తొమ్మిది సొసైటీలు ఉన్నాయి.

మేడ్చల్, డబిల్ పూర్, పూడూరు, బౌరంపేట్, అల్వాల్, శామీర్పేట్, ఘట్కేసర్, కీసర, దూలపల్లి సహకార సంఘాలు ఉన్నాయి. సహకార చట్టం ప్రకారం 13 మందితో పాలకవర్గాన్ని ఏర్పాటు చేస్తారు. ఎస్సీ మహిళ, ఎస్టి జనరల్, బీసీ జనరల్ కేటగిరీలకు మూడు డైరెక్టర్ పదవులు రిజర్వ్ చేస్తారు. మిగిలిన 10 జనరల్ కేటగిరిలో భర్తీ చేస్తారు.