దుఃఖానికీ సమయం కావాలి
తీరికలేని ఈ ప్రపంచం ఎందుకో
దుఃఖాన్ని కూడా తొందరపెడుతుంది
త్వరగా ముగించమంటుంది
ఒక మనిషి వెళ్లిపోయిన వెంటనే పాడె కట్టమంటుంది
నిప్పు పెట్టమంటుంది
కన్నీళ్లను తుడుచుకోమంటుంది !
గుండె పగిలిన శబ్దాన్ని అణచిపెట్టి
ముఖాన్ని మావలుగా నవ్వు ముఖంతో
కప్పేయమంటుంది.. కానీ..
దుఃఖం అనేది నేలపై పడిన చెత్త ముక్క కాదు
చీపురుతో ఊడ్చి అట్లా బయట పారేయడానికి
అది ఒక జీవితం.. మనతో పాటు
మనవెంటే నడిచిన అడుగులు
మన పేరును ఆప్యాయంగా పిలిచిన స్వరం
మన సంతోషాల్లో మనతో పాటు వెలిగిన నవ్వు
మన బాధల్లో భుజమై తోడుగా నిలిచిన మనిషి
అలాంటి జ్ఞాపకాలు
ఒక్క రోజులో ఎలా మాయమవుతాయి?
చెట్టు నరికితే దాని వలయాలు మిగిలినట్టే
మనిషి వెళ్లిపోయినా అతని స్పర్శ
మన హృదయంతో వలయాల్లా
ఎన్నాళ్లో తిరుగుతూనే ఉంటుంది
అయినా ఈ లోకం త్వరగా
‘ముందుకు సాగమంటుంది’
ముందుకే సాగాలి కానీ
మరచిపోవడం కోసం కాదు
దుఃఖాన్ని దాటేసి పోవడం కోసం కాదు
దానితో కలిసి నడవడం నేర్చుకోవడం కోసం
ఎందుకంటే ప్రేమించినవారి ఎడబాటు
కాలుకు తగిలిన చిన్న గాయం కాదు
కాలంతో మానిపోవడానికి
అది మనలోనే ఒక కొత్త స్థలాన్ని
స్థానాన్ని ఏర్పరచుకుంటుంది !
వాళ్లు లేని ఖాళీలో, శూన్యంలో, చీకటిలో
వాళ్ల జ్ఞాపకాల వెలుగుతో
ఆ స్థలం నిశ్శబ్దంగా నిలిచే కుహరం
అందుకే ఏడవాలనిపిస్తే ఏడవాలి
నిశ్శబ్దంగా ఉండాలనిపిస్తే ఉండాలి
జ్ఞాపకాలను గుర్తుంచుకోవాలనిపిస్తే
మళ్లీ మళ్లీ స్పర్శించాలి
దుఃఖానికి కూడా
దాని సొంత సమయాలూ మౌనాలూ ఉంటాయి
వర్షం పడ్డాక చినుకులు భూమిలోకి ఇంకినట్టుగా
కాలం గుండెలోకి ఇంకిన తర్వాతే
బాధ నెమ్మదిగా స్మృతిగా రూపం మార్చుకుంటుంది
అంతవరకు
లోకం ఎంత తొందర పెట్టినా
హృదయం కొట్టుకునే వేగాన్ని నమ్మాలి
ఎందుకంటే
ప్రేమ ఎంత లోతైనదో
దుఃఖం అంతకంటే లోతైనది
దుఃఖాన్ని పూర్తిగా దాటిపోలేము
దానితో కలిసి నడవడాన్ని జీవించడాన్ని మాత్రమే
కాలగమనంలో మనం నెమ్మదిగా నేర్చుకుంటాం!!






